పెద్ద కొడప్గల్/నిజాంసాగర్/భిక్కనూరు/ధర్పల్లి, సెప్టెంబర్ 16: ఉమ్మడి జిల్లా రైతులను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది.యూరియా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీ గోదాముల వద్ద వేకువజాము నుంచే బారులు తీరుతున్నారు. బస్తా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. పెద్ద కొడప్గల్ మండలంలోని ఆయా గ్రామాల్లోని రైతులు యూరియా కోసం మంగళవారం ఉదయం 4 గంటల నుంచి సొసైటీల ఎదుట పడిగాపులు కాశారు.
యూరియా కోసం పట్టాపాసు పుస్తకాలు, ఆధార్‌కార్డులు, చెప్పులు, బస్తాలు వరుసలో పెట్టారు. రైతులు పనులన్నీ వదులుకొని వర్షం కురుస్తున్నా బారులు తీరారు. ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో సరిహద్దులో ఉన్న సంగారెడ్డి జిల్లా కంగ్టి, మహారాష్ట్రలోని దెగ్లూర్ నుంచి రూ.550లకు బస్తా యూరియా తెచ్చుకుం టున్నారు.
క్యూలో ఉన్న రైతులకు ఏఈవోలు రాజ్యలక్ష్మి, మాధవి టోకెన్లు ఇవ్వగా గోదాం వద్ద బారులు తీరారు. సొసైటీకి వచ్చిన 440 యూరియా బస్తాలను పోలీసు పహారా మధ్య పట్టా పాసుపుస్తకానికి ఒక బస్తా యూరియా చొప్పున పంపిణీ చేశారు. ఉదయం నుంచి వరుసలో నిలబడిన కొందరు రైతులకు యూరియా అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
అర్ధరాత్రి నుంచే బారులు
ధర్పల్లి మండలంలో యూరియా కోసం అర్ధరాత్రి నుంచే గోదాముల వద్ద బారులు తీరుతున్నారు. మంగళవారం ధర్పల్లి సొసైటీకి యూరియా వచ్చిందని తెలియగానే రైతులు వందల సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పన యూరియా పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక ఎస్సై కళ్యాణి, సిరికొండ ఎస్సై రామకృష్ణ బందోబస్తు ఏర్పాటు చేశారు.సొసైటీకి 330 బస్తాల యూరియా రాగా, పంపిణీ చేసినట్లు ఏవో వెంకటేశ్, సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, కార్యదర్శి సంతోష్‌రెడ్డి తెలిపారు.
పిట్లంలో యూరియా కోసం పోటీ
పిట్లం మండలంలోని రాంపూర్ సొసైటీకి మంగళవారం 444 బస్తాల యూరియా రావడంతో పెద్ద రాంపూర్, కుర్తి, గౌరారం,మద్దెల్‌చెరువు, బొల్లక్‌పల్లి, బండపల్లి, కుర్తితండా, గౌరారం తండా, కట్టకింది తండా, చెరువు తండా, బొగ్గులకుంట తండా గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యూరియా బస్తాల కోసం రైతులు పోటీపడ్డారు. దీంతో పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. భిక్కనూరు మండలంలోని లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. వరుసలో సీసాలు, బ్యాగులు, చెప్పులు ఉంచారు.
యూరియా కోసం దవాఖాన నుంచి వ్యవసాయ కార్యాలయానికి..
భీమ్‌గల్, సెప్టెంబర్ 16: యూరియా వచ్చిన సమాచారం తెలిసి వైరల్ ఫీవర్‌తో దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ గిరిజన మహిళ తన స్లైన్‌ను తొలగించుకుని, చేతికి ఉన్న ఐవీ కాన్యులా తోనే భీమ్‌గల్ వ్యవసాయ శాఖ కార్యాలయానికి మంగళవారం వచ్చింది. మ రో గిరిజన రైతు యూరియా కోసం బైక్‌పై బయల్దేరి అదుపుతప్పి పడిపోయాడు. అయినప్పటికీ కాలు, చేతికి రక్తమోడుతున్న గాయాలతో వచ్చాడు.
యూరియా వస్తుందన్న సమాచారం అందుకున్న రైతులు, మహిళలు తెల్లవారక ముందే తండోపతండాలుగా భీమ్‌గల్ వ్యవసాయ శాఖ కార్యాలయానికి తరలివచ్చారు. యూరియా టో కెన్ల కోసం పడిగాపులు కాశారు. భీమ్‌గల్ సొసైటీ పరిధిలో 500 బస్తాలు, ముచ్కూర్ సొసైటీ పరిధిలో 300 బస్తాలు, ఆగ్రోస్‌లో 200 బస్తాలు రాగా.. జారీ చేసిన టోకెన్లతో ఆయా చోట్ల రైతులు బారులు తీరారు. యూరియా అందని రైతు లు నిరాశతో ప్రభుత్వంపై ఆ గ్రహం వ్యక్తంచేస్తూ వెనుదిరిగారు.