అకాల వర్షాలు ఆగడం లేదు.. సరిగ్గా పంట కోతలు, ధాన్యం తరలించే సమయంలోనే వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే చాలాచోట్ల కోతకొచ్చిన ధాన్యం రాలిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు నీట మునిగాయి. ఆదివారం సైతం పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వడగండ్లు కురిశాయి. లింగంపేట మండలంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఓ ఇంటిపై చెట్టు పడడంతో పాక్షికంగా దెబ్బతిన్నది. ధాన్యం తడిసిపోవడంతో పలుచోట్ల మొలకెత్తాయి.
లింగంపేట/నాగిరెడ్డిపేట్/ లింగంపేట/ గాంధారి/ బిచ్కుంద/ పిట్లం/ నిజాంసాగర్/ సిరికొండ/ కోటగిరి/ బోధన్ రూరల్/ ధర్పల్లి/ నవీపేట, ఏప్రిల్ 30: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా అకాలవర్షం.. అకాల వర్షం అన్నదాతల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అకాల వర్షం.. ఈదురుగాలులకు చేతికి వచ్చిన పంటలు దెబ్బతినడంతోపాటు ఇప్పటికే పంటను కోసి ఆరబెట్టిన ధాన్యం తడుస్తున్నది. ఆదివారం సైతం కురిసిన వర్షానికి ధాన్యం కుప్పల్లోకి నీరు చేరడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
లింగంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం మూడున్నర నుంచి గంట పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. లింగంపేట, ఎక్కపల్లి, సజ్జన్పల్లి, శెట్పల్లిసంగారెడ్డి, మెంగారం, లింగంపల్లి, ముస్తాపూర్, ఎల్లారం తదితర గ్రామాల్లో వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడువకుండా రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
వడగండ్ల కారణంగా ధాన్యం పూర్తిగా రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మెంగారం గ్రామ శివారులో కామారెడ్డి – ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై మర్రి వృక్షం, శెట్పల్లి సంగారెడ్డి గ్రామ రహదారిపై మరో చెట్టు కూలింది. మండలంలోని ఎక్కపల్లి గ్రామంలో చెట్టు నీల పోచయ్య ఇంటిపై పడడంతో ఇల్లు స్వల్పంగా కూలినట్లు సర్పంచ్ సతీశ్‌గౌడ్ తెలిపారు. మెంగారం గ్రామ శివారులో ప్రధాన రహదారిపై భారీ మర్రి చెట్టు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నాగిరెడ్డిపేట్తోపాటు వివిధ గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. గాంధారి, బిచ్కుంద మండలాల్లోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. పంట పొలాల్లోని వడ్లు రాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
పిట్లం మండలంలో ఒక్కసారిగా వర్షం కురియడంతో కొనుగోలుకేంద్రాలతో పాటు కళ్లాల వద్ద పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. నిజాంసాగర్ మండలంలో నిత్యం కురుస్తున్న వర్షానికి కళ్లాలో ధాన్యం తడిసిపోవడంతోపాటు వడ గండ్లతో ధాన్యం గింజలు నేలరాలాయి. ఆదివారం సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది.
సిరికొండ మండల కేంద్రంతోపాటు కొండూర్, రావుట్ల, న్యావనంది, తాటిపల్లి గ్రామాల్లో భారీ ఈదురుగాలులతో వడగండ్ల వాన కురిసింది. చేతికొచ్చిన వరి, మామిడి, టమాట దెబ్బతిన్నది. మెట్టు మర్రితండాలో దరావత్ రామ్ ఇంటి పైకప్పు గాలివానకు ఎగిరిపోయింది. కోటగిరి మండలంలోని సుంకిని, కొల్లూర్‌లో వడగండ్ల వాన కురిసింది. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. పలు ప్రాంతాల్లో ధాన్యానికి మొలకలు వచ్చాయి.
బోధన్ మండలం రాజీవ్‌నగర్ తండాలో ఆరబెట్టిన ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని రైతు పీర్యానాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఊట్పల్లి, నవీపేటలో ఆరబెట్టిన ధాన్యం కుప్పల్లోకి వర్షపు నీరు చేరింది.