ధరణి పోర్టల్‌ను తీసేసి పాత రెవెన్యూ పద్ధతిని తీసుకొస్తామంటున్న కాంగ్రెస్ నేతలపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఏండ్లు పాలించిన కాంగ్రెసోళ్లు రైతుల మధ్య భూ తగాదాలు, పంచాయితీలు పెట్టి చోద్యం చూసిందే తప్పా.. ఏనాడూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేదు. చేయి తడిపితే చాలు పేర్లు మార్చి, దళారుల రాజ్యంలో రైతులను దగా చేసిన చేదు జ్ఞాపకాలు ఇంకా మదిలో ఉన్నాయంటున్నారు. పదేండ్లలో సీఎం కేసీఆర్.. ధరణి అనే అద్భుతమైన వ్యవస్థను రూపొందించి రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిండు. పటేల్, పట్వారీ వ్యవస్థను రూపుమాపి, యజమాని వేలిముద్రతో నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయ్యే పద్ధతి తెచ్చిండు. రూపాయి లంచం లేకుండా, పారదర్శకంగా సత్వర సేవలందిస్తున్న ధరణిని తీసేస్తామని చెబుతున్న కాంగ్రెస్‌ను తరిమేస్తామని రైతులు తేల్చిచెబుతున్నారు. రైతుల మధ్య భూ పంచాయితీలు పెట్టాలని చూస్తున్నట్లు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఉన్నాయంటూ మండిపడుతున్నారు.
ఖలీల్‌వాడి, నవంబర్ 24 : బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో ఎలాంటి భూసమస్యలు లేకుండా దర్జాగా ఉన్నాం. గతంలోని మాన్యువల్ పద్ధతిలో రికార్డులు రాసి, భద్రపరిచే వారు. దీంతో మేము అరిగోస పడ్డాం. భూమి ఒకరిది, కాస్తులో మరొకరు ఉండేవాళ్లు. దళారుల రాజ్యం నడిచేది. క్షేత్రస్థాయిలో భూమిని ఒకరు సాగు చేస్తే పట్టా మాత్రం ఇంకొకరి పేరుతో ఉండేది. దున్నేదొకరైతే భూమి పట్టాలను బ్యాంకుల్లో పెట్టి రుణం తీసుకునేది మరొకరు ఉండేది. ఉన్న భూమి కన్నా మాన్యువల్‌గా ఎక్కువ భూమికి పట్టాలు చేసేది. కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాత దళారీ వ్యవస్థ పూర్తిగా పోయింది. రైతులు ధైర్యంగా ఉన్నారు.
గతంలో రెవెన్యూ కార్యాలయానికి పోవాలంటే హడలిపోయేవాళ్లం. పహాణీ కావాలన్నా పైరవీగాళ్లని పట్టుకోవాల్సిందే. భూమి బదిలీ చేయాలంటే నరకయాతన పడ్డాం.. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత పట్టా పాసు పుస్తకం లేని ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చింది. భూమి వివరాలను ధరణిలోకి తీసుకురావడంతో చాలా తేలికైంది. నా భూమి వివరాలు చూసుకోవాలంటే రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇంత మంచి ధరణి తీసేస్తా అంటే కాంగ్రెస్‌ను బొంద పెడుతాం.
భూస్వాములకు మేలు చేసేందుకే కాంగ్రెస్ ధరణి రద్దు చేస్తామంటున్నది. కేసీఆర్ ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా తెల్లకాగితాల మీద రాసుకున్న భూములకు మధ్యవర్తులను తొలగించి ఉచితంగా పట్టాలు ఇచ్చింది. మా భూములను ధరణిలో పెట్టింది. ధరణి పోర్టల్‌తో చిన్న, సన్నకారు రైతుల భూములకు రక్షణ ఏర్పడింది. ధరణితో రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. అలాంటి ధరణిని చేస్తామంటున్న కాంగ్రెస్‌ను ఓటు ద్వారా బంగాళాఖాతంలో కలుపుతాం.
కాంగ్రెస్ పాలనలో పట్వారీలతో గోసపడ్డాం. మాకు ఎకరంన్నర భూమి ఉంది. అప్పట్లో పట్వారీ 35 గుంటలకు మాత్రమే పట్టాలో ఎక్కిచ్చిండు. మిగతా భూమిని మేమే సాగు చేసుకుంటానం. కానీ పట్టా లేదు. దీంతో మాకు రైతుబంధు 35 గుంటలకే పడుతుంది. ఇట్లా చాలా మంది భూములు సాగులో ఉన్నప్పటికీ పట్టాలకు ఎక్కించలేదు. కాంగ్రెస్ నాయకులు మళ్లా పాత పద్ధతే తీసుకొస్తామని అంటున్నారు. వాళ్లు వచ్చేది లేదు, చేసేది లేదు. ఎనకటి మనుషులు ఎనికటి వేషాలే వేస్తరు గానీ కొత్తగా ఏం ఆలోచిస్తరు. కాంగ్రెస్ వాళ్లతో రైతులకు ఇబ్బందులు ఉంటాయి. సీఎం కేసీఆర్ దళారులను తీసేసి మంచి పని చేసిండు.
కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ వ్యవస్థలో మళ్లీ పాత పద్ధతులు తెస్తానంటున్నది. పటేల్, పట్వారీ వ్యవస్థ వస్తే రైతులకు గోస మొదలైనట్లే. పట్టాదారు స్థానంలో తిరిగి అనుభవదారు, మాన్యందారు కాలం పెట్టడంతో నిజమైన పట్టాదారుకు తిప్పలు తప్పవు. గతంలో భూములపై హక్కులు పొందిన వారికే తిరిగి ఎందుకు పట్టాలు ఇస్తారు. పట్టాలు ఉన్న నిజమైన రైతుల పరిస్థితి ఏం కావాలె. వారికే పట్టాలు ఇస్తామనడం వారి తెలివితక్కువ తనాన్ని బయట పెడుతున్నది. పటేల్, పట్వారీ వ్యవస్థతో తిరిగి లంచగొండి, దోపిడీ వ్యవస్థ వస్తది. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీని తరిమికొడితేనే రాష్ట్రం బాగుపడతది. ఇప్పుడిప్పుడే రైతులు ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రశాంతతను పోగొట్టేలా కాంగ్రెసోళ్ల మాటలు ఉన్నాయి.
గతంలో భూములు పట్టా చేయించాలంటే పైరవీలు చేయాల్సి వచ్చేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత పాస్ పుస్తకాలు ధరణిలో అవుతున్నాయి. పైరవీకారులు, లంచాలు లేకుండా పనులు అవుతున్నాయి. రైతు సొంతంగా మీ సేవకు పోయి స్లాట్‌బుకింగ్ చేసుకుంటే పని అయిపోతుంది. ఇంటికి పోస్టులో పాస్‌పుస్తకాలు వస్తున్నాయి. గతంలో ఏండ్ల తరబడి తిరిగినా కాకపోయేది. కానీ పనులు ఇప్పుడు సులువుగా అవుతున్నాయి. ధరణితో అందరి భూములకు భద్రత వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణితో పేద, మధ్యతరగతి రైతులకు వారి భూములకు భద్రత ఏర్పడింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు అయిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ధరణి ఉండాల్సిందే.
కాంగ్రెసోళ్లు ధరణిని తీసేస్తామంటున్నారు. ధరణి వచ్చిన తర్వాత ఒకే దగ్గర రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయిపోతున్నాయి. రైతులకు రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి. ధరణి రద్దు చేస్తే రైతులు తిరిగి రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ గతంలో లాగా చెప్పులరిగేలా తిరగాలి. వీఆర్వోలు, పట్వారీల వెంట తిరగాలి. అయినా పని కాదు, ఇప్పుడు అవస్థలన్నీ పోయాయి. కాంగ్రెస్ సర్కారు వస్తే రైతులకు కష్టాలు మళ్లీ మొదలవుతాయి. రైతులు బ్రోకర్లు, పటేల్, పట్వారీల వెంట తిరిగి లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా జీవిస్తున్నారు.
ధరణి పోర్టల్‌తోనే రైతు భూములకు భరోసా వచ్చింది. ప్రతి భూమిని ఆన్లైన్లో చూసుకునే పరిస్థితి రావడంతో రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలు లేకుండా చేసినట్లయ్యింది. ఒకరి భూమిని మరొకరికి బదలాయించే పరిస్థితి లేకుండా పోయింది. ధరణితోనే తెలంగాణ రైతులకు మంచి రోజులు వచ్చాయి. ఏండ్లపాటు భూములకు సంబంధించిన పత్రాల కోసం తిప్పలు పడ్డాం. ధరణితో ఆ సమస్యలన్నీ తీరిపోయాయి. మళ్లీ ఇప్పుడు పాత రోజులు తెస్తామంటున్న కాంగ్రెస్‌ను తగిన బుద్ధి చెబుతాం.
ధరణి ధీమాతో ధైర్యంగా బతుకుతున్నాం. ధరణి లేకుంటే దళారుల రాజ్యమొస్తది. లంచాలు పెరుగుతాయి. ఎవరి భూమి ఎవరి పేరు మీద ఉన్నదో తెల్వదు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్నోళ్ల సంగతి మేమే చూసుకుంటాం. ఓటుతో వాళ్లనే బంగాళాఖాతం విసిరేస్తాం. గతంలో పట్వారీ వ్యవస్థతో విసిగిపోయాం. ధరణి వచ్చినంక భూముల కొనుగోళ్లు అమ్మకాలు సులువు అయ్యాయి. ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన పని లేదు. క్షణాల్లో భూమార్పిడి జరిగిపోతున్నది. ధరణిని కాపాడుకుంటాం.