కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. పథకాల అమలులో చిత్తశుద్ధి లోపించింది. రైతుభరోసా విషయంలో అది మరోసారి ప్రస్ఫుటమైంది. ఎప్పుడో నాట్ల సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం.. ఇప్పుడు పంట కోతలు కొనసాగుతున్నప్పటికీ ఇవ్వకుండా రైతులకు రిక్త‘హస్తమే’ చూపింది. డిసెంబర్ చివరి నాటికి వేస్తామని, సంక్రాంతికి ఇస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. చివరకు మార్చి 31లోపు రైతులందరికీ రైతుభరోసా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులంతా ఘనంగా ప్రకటనలు చేశారు. తీరా మార్చి 31 పోయి పన్నెండు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. ఉమ్మడి జిల్లాలో ఇంకా 2 లక్షల మందికి పైగా రైతుభరోసా జమ కాలేదు. పూటకో మాట చెబుతూ రైతుభరోసా ఎగ్గొడుతున్న వైనంపై రైతాంగం భగ్గుమంటున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధు పథకానికి నీళ్లొదిలారు. గత వానకాలంలో పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. దాన్ని రూ.12 వేలకు తగ్గించింది. పోనీ అదన్న సక్కగా ఇస్తారా అనుకుంటే అదీ జరుగలేదు. వానకాలంలో ఎగ్గొట్టినప్పటికీ యాసంగిలోనైనా రైతుభరోసా ఇస్తారని ఎదురుచూసిన రైతాంగానికి నిరాశే మిగిలింది. గడువు మీద గడువు చెప్పుకుంటూ ప్రభుత్వం పంట కోతల సమయం దాకా లాక్కొచ్చింది.
నాట్ల సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం నేడు, రేపు అంటూ కాలం వెళ్లదీశారు. ఆ తర్వాత మార్చి 31కి గడువు పొడిగించారు. మొన్నటి గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజున సీఎం రేవంత్‌రెడ్డి రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. మార్చి 31 లోపు ఆయా పథకాలను పూర్తి చేస్తామని ఘనంగా ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లోనూ ఇదే చెప్పారు. కానీ గడువు దాటిపోయింది. అయినా సాయం అందలేదు. గడువు మీద గడువు పొడిగించినప్పటికీ ఇంకా రైతుభరోసా పథకం పూర్తిగా అమలు కాలేదు.
రైతులకు భరోసా లేని సాయం..
కేసీఆర్ హయాంలో విత్తనాలు వేసే సమయంలోనే రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసే వారు. విత్తనాలు, ఎరువులు, కూలీలు ఇతర అవసరాలకు ఆ డబ్బులు ఉపయోగపడేవి. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయం పంపిణీ ప్రహసనంగా మారింది. రైతు భరోసా పథకం ఉద్దేశాన్ని రేవంత్ ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని పంటలు కోసి, కాంటాలు వేస్తున్నా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పంట కోతలు ఊపందుకున్నాయి. కొనుగోళ్లు కూడా ప్రారంభమయ్యాయి. కొంత మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం రాగా, ఇంకా రెండు లక్షల మందికి పైగా అందలేదు. ఈ పరిస్థితిలో రైతుభరోసా ఇస్తారా.. ఎగ్గొడుతారా? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
కొత్త పట్టాదారుల పరేషాన్..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పట్టాదారుల్లో ఏ ఒక్కరికి కూడా రైతుభరోసా రాలేదు. 2024 జనవరి 1 నాటికి పట్టా పాస్‌బుక్కులు ఉన్న వారందరికీ ఎకరాకు రూ.12వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత జనవరిలో దరఖాస్తులను స్వీకరించింది. ధరణి డేటా ఆధారంగా బ్యాంక్ అకౌంట్ వివరాలను ఏఈవోలు అప్డేట్ చేశారు. కానీ ఇంత వరకూ రూపాయి సాయం కూడా రైతుల ఖాతాల్లో జమ కాలేదు.
పాత పట్టాదారులకు అరకొరగా పెట్టుబడి సాయం వచ్చినప్పటికీ, కొత్త పట్టాదారుల్లో ఏ ఒక్కరికీ సాయం అందలేదు. రైతుభరోసా పంపిణీ ప్రారంభించి రెండు నెలలు పూర్తయినా ఇప్పటి వరకు ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు రైతు భరోసా జమ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నది. కానీ అందులోనూ అర్హులైన ఎంతో మంది రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. ప్రతి గ్రామంలో 50 శాతం లోపే రైతు భరోసా అందింది. మిగతా రైతులు ఏవో, ఏఈవోల వద్దకు వెళ్లి ప్రశ్నిస్తుండగా, ఏం సమాధానం చెప్పాలో తెలియక వారు సతమతమవుతున్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండె..
కేసీఆర్ సారు ఉన్నప్పు డు మంచిగుండె. నాట్లు ఏసే టైంలనే రైతుబంధు పైసలు ఖాతాల పడుతుండె. ఆ పైసల్తోని ఎరువులకు, కూలీలకు, అట్లనే ట్రాక్టర్ ఖర్సు ఎల్లిపోతుండె. గీ కాంగ్రెస్ సర్కారు కూడా అట్లనే డబ్బులు ఇస్తదని ఆశ పడితిమి. కానీ వాళ్లొచ్చినంకా ఏం ఫాయిదా లేదు. నాట్లు ఏసేటప్పుడు రావాల్సిన పైసలు రాకపా యే. అప్పు తెచ్చి పంట ఏసిన. ఇప్పుడు పంట కూడా కోస్తిమి. అయినా సర్కారు పైసలు రాలే. గిదేందని రోజూ బ్యాంకు సుట్టు, అధికారుల సుట్టు తిరుగుతున్న. వోళ్లు కూడా జవాబు చెప్తలేరు. మంచిజేసే కేసీఆర్‌ను ఒదిలి ప్రజలు గీ రేవంత్‌రెడ్డిని ఎందుకు గెలిపిచ్చిండ్రో అర్థమైతలేదు.
– జాదవ్ రాములు, రైతు, మేడ్‌పల్లి తండా, చందూర్
ఇస్తరో ఇయ్యరో?
భూమి కొనుక్కుని పట్టా చేపిచ్చుకున్న. రైతుభరోసాకు దరఖాస్తు కూడా పెట్టుకున్న. మొన్న కొందరికి డబ్బులు పడ్డాయని చెబితే నాకూ అత్తయని అనుకున్న. మూడు నెలలై పాయే. రూపాయి రాకపాయే. ఇదేందని వ్యవసాయ అధికారిని అడిగితే అస్తాయే అని చెబుతుండు. పైసలు అచ్చుడు నమ్మికతక్కనే. మల్లా పదిహేను దినాలైతే నారుమడులు షురూ జేస్తాం. మొన్నటి పంటకే సర్కారు డబ్బులు ఇయ్యలే. మల్ల పంటకే ఏమిస్తది?
– పాల్య శ్రీనివాస్, రైతు, శంకోర, వర్ని
కొందరికిచ్చి మిగతోళ్లకు ఎగ్గొడ్తారా?
నాకు ఐదెకరాల పొలమున్నది. మునుపు నార్లు పోసే టైంలనే కేసీఆర్ పైసలు అత్తుండే. పంట ఏసేతందుకు అవి మత్తు సౌలత్ అయితుండే. గీ రేవంత్‌రెడ్డి అచ్చినంక రైతుబంధు పైసలు అత్తలేవు. కొందరికి అచ్చినయ్. కొందరికి రాలే. ఎందుకత్తలేదని అడిగితే పేర్లు తప్పులున్నయని చెబుతుండ్రు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు పేరు తప్పు, ఊరు తప్పు అని ఏం లేకుండే. ఈ కాంగ్రెసోళ్లు అచ్చినంకనే ఇవ్వన్ని సమస్యలు అచ్చినయ్. అరే కొందరికి పైసలు ఇచ్చి మిగతోళ్లకు ఇయ్యకపోవుడేందో అర్థమైతలేదు. రైతులు వోళ్లు అయినా రైతులే కదా. మరీ ఎందుకిట్ల జేసుడు?
– రమావత్ కళాబాయి, రైతు, కారేగాం, చందూర్