రూ.2 లక్షల్లోపు రుణాలు మాఫీ చేశామని ప్రభుత్వమేమో ప్రకటనలు గుప్పిస్తున్నది. మరోవైపు, బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు మాఫీ కాలేదని రైతాంగం గగ్గోలు పెడుతున్నది. అర్హులైన తమకు మాఫీ కాలేదన్న బాధతో కర్షక లోకం కదం తొక్కుతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం కూడా రైతుల ఆందోళనలు కొనసాగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులు.. బ్యాంకులు, సొసైటీల ఎదుట బైఠాయించారు.
– నస్రుల్లాబాద్/నాగిరెడ్డిపేట్/మోస్రా/సారంగపూర్/ ఏర్గట్ల/బోధన్ రూరల్/లింగంపేట్, ఆగస్టు 20
రుణమాఫీ కాని రైతుల ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. మంగళవారం కూడా ఉభయ జిల్లాల వ్యాప్తం గా నిరసనలు కొనసాగాయి. షరతులు లేకుం డా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏర్గట్లలో రైతులు ధర్నా చేశారు. అక్కడకు చేరుకున్న నోడల్ అధికారి మానిషతో తమ గోడు వెల్లబోసుకున్నారు. మాకెందుకు మాఫీ కాలేదని బోధన్ మండలం కల్దుర్కిలో అన్నదాతలు నిరసన తెలిపారు. మోస్రా మండలంలోని కెనరా బ్యాంకు ఎదుట రైతన్నల ఆందోళన కొనసాగింది. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు బ్యాంకు సిబ్బందిని నిలదీశారు.
కేసీఆర్ పాలనలో ఎన్నడూ రోడ్డెక్కని తమను ఇప్పుడు రోడ్డు మీదకు తీసుకొచ్చారని మండిపడ్డారు. సీఐ జయేశ్, ఎస్సై కృష్ణకుమార్ రైతులకు సర్దిచెప్పారు. మరోవైపు, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పాల్దా సొసైటీ వద్ద రైతులు చేపట్టిన ఆందోళన మంగళవారం కూడా కొనసాగింది. సొసైటీ కార్యాలయం గేటుకు తాళం వేసి నిరసన తెలుపగా, డీసీవో శ్రీనివాస్, డీసీసీబీ సీఈవో నాగభూషణం, డీజీఎం లింబాద్రి, అగ్రికల్చర్ ఏడీ ప్రదీప్‌కుమార్ వచ్చి రైతుల సమస్యలు తెలుసుకున్నారు.
అర్హులైన వారందరికీ మాఫీ వర్తించేలా చేస్తామని డీసీవో హామీ ఇవ్వ గా, సంతృప్తి చెందని అన్నదాతలు ఒప్పంద పత్రం రాసివ్వాలని కోరారు. అలా రాసివ్వడం కుదరదన్న డీసీవో.. న్యాయం చేసే బాధ్యత తనదని పలుమార్లు విజ్ఞప్తి చేయగా, రైతులు శాంతించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలోని వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట తాండూర్, కన్నారెడ్డి, చీనూర్, మేజర్వాడీ, మాల్తుమ్మెద గ్రామాల రైతులు నిరసన తెలిపారు. మాజీ జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు.
తాడ్వాయి మండలంలోనూ రైతుల ఆందోళన కొనసాగింది. మాఫీ చేస్తామని మోసగించిన వైనంపై అన్నదాతలు రోడ్డెక్కారు. కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిని దిగ్బంధించారు. ఆంక్షల్లేని రుణమాఫీతో పాటు రైతుభరోసా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో బోధన్-బాన్సువాడ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. పోలీసులు సముదాయించడంతో ఆందోళన విరమించి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎదుట బైఠాయించారు. తమకెందుకు మాఫీ రాలేదని బ్యాంకు మేనేజర్ రాహుల్‌తో వాగ్వాదానికి దిగారు.
బాన్సువాడ, ఆగస్టు 20: బాన్సువాడలో రుణమాఫీ కాని రైతుల సంతకాలను బీజేపీ ఆ ధ్వర్యంలో మంగళవారం సేకరించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణాలను మాఫీ చేయాలని రైతుల కోసం రచ్చబండ పేరిట కార్యక్రమం నిర్వహించారు. షరతుల్లేకుండా రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా కింద రూ.15 వేల చొప్పున వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనా రాయణ డిమాండ్ చేశారు.