floods | కంటేశ్వర్, సెప్టెంబర్ 15 : వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బోధన్ నియోజకవర్గ మండలాల బీజేపీ అధ్యక్షులు, రైతులతో కలిసి ప్రజావాణిలో సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో శ్రీరామ్ సాగర్ వెనుకజలాల వల్ల జరిగిన పంట, ఆస్తి నష్టానికి సంబంధిచి సహాయక నిధులు ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బోధన్ నియోజక వర్గంలో ఇటీవల అకస్మితంగా కురిసిన వర్షాల కారణంగా వేలాది ఎకరాల సోయా, వరి, పత్తి, పంట 90 శాతం పెట్టుబడి పెట్టిన తర్వాత పూర్తిస్థాయిలో పంట నష్టం జరిగిందని, వరద నీరు ఇళ్లల్లోకి వచ్చి తినడానికి తిండి సైతం లేకుండా ప్రజలు తమ నిత్యవసర వస్తువులను కూడా కోల్పోవడం జరిగిందని అన్నారు. రైతులు పండించిన పంటను పూర్తిగా కోల్పోయి తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఇప్పటివరకు రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదన్నారు.
ఎలాంటి పరిమితులు లేకుండా రైతులు ఎన్ని ఎకరాలు అయితే నష్టపోయారో అన్ని ఎకరాలకు పంట పూర్తి నష్టపరిహారాన్ని అందచేయవలసిందిగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం రైతులు కోలుకోవాలంటే ప్రభుత్వ ఆర్థిక సాయం చాలా అవసరమని నష్టపోయిన రైతులకు తక్షణమే సాయం సహాయం అందజేయడం ద్వారా కనీసం రబీ పంట వేసుకోవడానికి సహాయం చేసినట్టవుతుందని అన్నారు. ఒక వేళ పూర్తి నష్ట పరిహారాన్ని చెల్లించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, రైతులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.