భీమ్గల్, సెప్టెంబర్ 15: రైతులను యూరియా కష్టాలు వీడడంలేదు. యూరియా కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. భీమ్గల్ సొసైటీకి యూరియా స్టాక్ వచ్చిందన్న సమాచారంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో సోమవారం తరలివచ్చారు. ఆలస్యమైతే తమకు యూరియా లభించదేమో, ఎక్క డ స్టాకు అయిపోతుందేమో అని తెల్లవారుజాము నుంచే వ్యవసాయ శాఖ కార్యాలయం గేటు ఎదుట బారులు తీరారు.
బుధవారం వరకు యూరియా స్టాక్ రాదని వ్యవసాయాధికారులు ముందు గానే విలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేసినప్పటికీ రైతులు తరలివచ్చారు. కార్యాలయం తెరుచుకునేలోపు రెండు మూడు వందల మంది రైతులు తమ పాస్ పుస్తకాలను క్యూలో ఉంచి పడిగాపులు కాశారు. అధికారులు వచ్చి నచ్చజెప్పినప్పటికీ అక్కడి నుంచి వారు కదలలేదు. దీంతో అధికారులు ఫోన్ లో ఉన్నతాధికారులతో మాట్లాడారు. యూరియా మంగళవారం వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు చెప్పడం తో ఆగ్రహించిన రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ వెనుదిరిగారు.