కామారెడ్డి, మే 9 : కారులో గ్యాస్ నింపుడుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి మూడు కార్లు, ఒక బైక్ దగ్ధమయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో శనివారం ఈ ఘటన చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. దేవునిపల్లికి చెందిన శ్రీశైలం శనివారం సిలిండర్ నుంచి తన కారులోకి ఎల్పీజీ గ్యాస్ నింపుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో రెండు కార్లు, బైక్‌కు కూడా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి.
పెద్ద శబ్ధం వచ్చి మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫైరింజన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. మంటల్లో కాలిపోయిన బైక్ యజమాని సురేశ్ ఫిర్యాదు మేరకు శ్రీశైలంపై కేసు నమోదు చేశామని రూరల్ సీఐ శ్రీధర్‌గౌడ్ తెలిపారు.