భిక్కనూరు, సెప్టెంబర్ 3: మండలంలోని బస్వాపూర్‌లో గల డబుల్ బెడ్రూం ఇండ్లలో నివాసముంటున్న వారిపై అధికారులు, పోలీసులు మంగళవారం జులుం ప్రదర్శించారు. అక్రమంగా నివాసముంటున్నారని చెబుతూ బలవంతంగా ఖాళీ చేయించారు. ఇండ్లల్లో ఉన్న సామగ్రిని బయట పడేసి, గదులకు తాళాలు వేశారు.
మరోసారి ఇటువైపు వస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇదేమి దౌర్జన్యమని, జోరుగా వర్షాలు కురుస్తున్న వేళ ఉన్నఫళంగా వెళ్లిపోవాలంటే తాము ఎక్కడకు వెళ్లాలంటూ లబ్ధిదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కేసీఆర్ హయాంలో బస్వాపూర్ గ్రామ శివారులో 50 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు.
ఆ సమయంలో బస్వాపూర్ గ్రామంలో కలిసి ఉన్న సిద్ధరామేశ్వర్‌నగర్ కాలనీ ఆ తర్వాత గ్రామంగా ఏర్పడడంతో, రెండు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి బస్వాపూర్ వాసులకు 41, సిద్ధరామేశ్వర్‌నగర్ కాలనీ వాసులకు 9 ఇంప్ల కేటాయించాలని తీర్మానించారు. ఈ నేపథ్యంలో అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయగా, నాటి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ వారికి ఇండ్లను కేటాయిస్తూ అక్టోబర్ 7, 2023 రోజున ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, లాటరీ ద్వారా ఇండ్లను కేటాయించాల్సి ఉండగా, ఎలక్షన్ కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికలు పూర్తయి, ఎనిమిది నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించలేదు. మరోవైపు, ఉండేందుకు జాగా లేక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు ఇటీవల డబుల్ ఇండ్లలోకి వచ్చి నివాసముంటున్నారు.
అయితే, మంగళవారం ఆర్డీవో రంగనాథ్, తహసీల్దార్ శివప్రసాద్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది వచ్చి లబ్ధిదారులను బలవంతంగా ఖాళీ చేయించారు. వర్షాలు పడుతున్న సమయంలో తాము ఎటు పో వాలని లబ్ధిదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు, ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ అధికారికంగా లబ్ధిదారుల జాబితా విడుదల చేసిన తర్వాత ఇప్పటికీ ఇండ్లు ఇవ్వకుండా లబ్ధిదారులను ఇబ్బందులు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్న ఫళంగా ఖాళీ చేయిస్తే వారు ఎక్కడకు పోవాలని గంప గోవర్ధన్ ప్రశ్నించారు.