నిజామాబాద్, అక్టోబర్ 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన రేవంత్ రెడ్డి సర్కార్‌కు మద్యం వ్యాపారుల నుంచి గట్టి దెబ్బ తగిలినైట్లెంది. మద్యం టెండర్ల పేరుతో ఆదాయం సమకూర్చుకోవాలని ఆశించగా లిక్కర్ వ్యాపారుల నుంచి అంతగా స్పందన రాలేదు. దరఖాస్తు ఫీజును రూ.3లక్షలు పెంచడంతో భంగపాటు తప్పలేదు. ఫీజు భారాన్ని తప్పించుకునేందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పేరుమోసిన లిక్కర్ కింగ్‌లు బహిరంగంగానే జత కట్టారు. గుంపులుగా మారి దరఖాస్తులను వేయడం వల్ల అతి తక్కువగా డిమాండ్ ఏర్పడింది. రూ.కోట్లలో వ్యాపారం జరిగే ప్రాంతాల్లోనూ దరఖాస్తులు తక్కువగా నమోదు అయ్యా యి.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద, నిజాంసాగర్, బాన్సువాడతో పాటుగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ నగరం, బోధన్ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీనికి సిండికేట్ వ్యాపారుల మాయగా అంతా భావిస్తున్నారు. కొత్తగా దరఖాస్తులు సమర్పించిన వారికి దుకాణాలు వస్తే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందనే భయంతో సిండికేట్‌గాళ్లు తమ ఉచ్చులోకి లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వార దుకాణాలు తిరిగి తమ చేతికే చిక్కాలనే ప్రయత్నాలకు ఒడిగడుతున్నారు. సిండికేట్ భారీ స్థాయిలో జరుతుండగా ఈ ప్రయత్నాలను నివారించేందుకు ఆబ్కారీ శాఖ వైఫల్యం చెందినైట్లెంది. కొంత మంది పేరు మోసిన సిండికేట్ వ్యాపారులకు దుకాణాలకు వచ్చిన దరఖాస్తుల వివరాలను గోప్యంగా వెల్లడించడం, కొత్తగా వచ్చే వారికి తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో జోరుగా జరిగింది.
సిండికేట్ విచ్ఛిన్నం అయ్యేనా…?
మద్యం దుకాణాలకు దరఖాస్తులు రాకపోవడానికి ఆబ్కారీ శాఖ అధికారుల అక్రమ తంతు ప్రధాన కారణం కావడంతో పాటు రూ.3లక్షల ఫీజు కూడా ప్రభావం చూపుతున్నది. ఎ స్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు ప్రకటించగా ఆ వర్గాల్లోనూ దరఖాస్తులు సమర్పించేందుకు ఎక్కువగా ముందుకు రాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ చేసిన దుకాణాల్లో తెర వెనుక సింటికేట్వ్యక్తులే చక్రం తిప్పుతున్నారు. మద్యం వ్యా పారాలతో సంబంధం లేని వ్యక్తులను ఈ రొంపిలోకి దింపి కర్త, కర్మ, క్రియ అంతా సిండికేట్ వ్యాపారులే నడిపిస్తున్నారు.
తెర వెనుక డబ్బులు భరించడంతో పాటు దరఖాస్తుదారులకు మాయ మాటలతో మెప్పించి వారి పేరుతోనే దరఖాస్తులు వేయిస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిండికేట్‌కు ముకుతాడు వేశారు. అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు పకడ్బందీగా టెండర్లు నిర్వహించారు. కానిప్పుడు అడ్డూ అదుపు లేకుండా సిండికేట్‌గాళ్లు రెచ్చిపోతున్నప్పటికీ తెరవెనుక సొంత శాఖ అధికారులే వత్తాసు పలుకుతుండడం విడ్డూరంగా మారింది. ప్రభుత్వ పెద్దలకు ఈ తంతు తెలిసినప్పటికీ ఏమీ చేయలేక పోతుండడం అనుమానాలకు తావిస్తోంది. చాలా చోట్ల అధికార పార్టీకి చెందిన నేతలు సైతం సిండికేట్ వ్యాపారులతో చేతులు కలిపి దందా ను కేంద్రీకృతం చేయాలనే ప్రయత్నాలకు ఒడిగడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సిండికేట్ వ్యవహారాన్ని ఆదిలోనే తుంచేయకపోతే భవిష్యత్తులో అనేక అనార్థాలకు దారి తీసే అవకాశాలున్నాయి.
ఆగమాగం అవుతోన్న ఆబ్కారీ శాఖ..
ఆబ్కారీ శాఖ పనితీరుకు మద్యం టెండర్లకు వచ్చే దరఖాస్తులను ప్రభుత్వం ముడిపెట్టింది. దీంతో ఆబ్కారీ శాఖ ఆగమాగం అవుతుండడంతో పాటుగా తమ ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయనే బాధ కొంత మంది అధికారుల్లో కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 102 మద్యం దుకాణాలున్నాయి. సెప్టెంబర్ 26న నోటిఫికేషన్ జారీ అయ్యింది. మూడు వారాల వ్యవధిలో మొత్తం 2568 దరఖాస్తులు వచ్చాయి. రూ.3లక్షల చొప్పున దరఖాస్తు రుసుముతో మొత్తం రూ.77.04 కోట్లు ఆదాయం సమకూరింది. గతంలో రూ.2లక్షల ఫీజుకు 3,759 దరఖాస్తులతో రూ.76కోట్లు వచ్చింది. ఈ నెల 23న మద్యం టెండర్లకు డ్రా పద్ధతిలో కేటాయింపులు చేపట్టనుండగా ఒక్కసారిగా తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
అక్టోబర్ 23 వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు పెంచిం ది. 27వ తేదీన లాటరీ తీయనున్నట్లుగా సర్కార్ ప్రకటించింది. కామారెడ్డి జిల్లాలో 49 మద్యం దుకాణాలున్నాయి. 2025-27 మద్యం పాలసీలో భాగంగా ఈసారి స్పం దన అంతగా రాలేదు. గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు 2204 దరఖాస్తులు రాగా రూ.2లక్షల రుసుముతో రూ.44.80కోట్లు ఆదాయం సమకూరింది. కానిప్పుడు కేవలం 1500 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లుగా ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. నాలుగైదు రోజుల గడువు పెంచడంతో ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సిండికేట్ ఉచ్చును విచ్చిన్నం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదాయం పెరగడానికి అధికారులు ప్రయత్నిస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం..
మద్యం పాలసీ 2025-27లో భాగంగా మద్యం దుకాణాల కేటాయింపునకు దరఖాస్తుల గడువును ప్రభు త్వం పెంచింది. ఈ నెల 23వ తేదీ వరకు ఆశావాహులు ఎవరైనా దరఖాస్తు సమర్పించుకునేందుకు అవకాశం ఉంది. 27వ తేదీన డ్రా పద్ధతిలో కలెక్టర్ సమక్షంలో దుకాణాల కేటాయింపు బహిరంగంగానే జరుగుతుంది. పెంచిన గడువును మద్యం వ్యాపారంలో ఆసక్తి ఉన్నవారంతా వినియోగించుకోవాలని కోరుతున్నాము.
– మల్లారెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి