నిజామాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎలాంటి కేసులనైనా ఛేదించే పోలీసులు.. కొన్ని సందర్భాల్లో కొన్ని కేసులు సవాలుగా మారుతుంటాయి. అలాంటిదే ఈ కేసు కూడా. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండ లం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో మృతి చెందిన ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్‌కు సంబంధించిన కేసు లో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నెల 25వ తేదీ నాటికి సరిగ్గా ఈ ఘటన జరిగి నాలుగు నెలలు అవుతున్నది. అయినప్పటికీ కామారెడ్డి పోలీసులు మాత్రం ఈ కేసులో ఎలాంటి పురోగతినీ సాధించకపోవడం గమనార్హం.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఈ కాలంలో ముగ్గురు మృతి చెందిన కేసులో ఎలాంటి ఆధారాలను కనుక్కోలేక పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముగ్గురు కలిసి చనిపోయారా? ఎవరైనా ముందుగా దూకితే కాపాడే ప్రయత్నంలో అందరూ చెరువులో మునిగారా? లేదంటే హత్యాయత్నం జరిగిందా? అనే అనుమానాలను నివృత్తి చేసేందుకు పోలీసులు ముందుకు రావడం లేదు. ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లకు రోజుల తరబడి కాలం పట్టదు. ఈ ఘటన జరిగి నాలుగు నెలలువుతుండగా..ఇప్పటికే దర్యాప్తు అధికారులకు సంబంధిత నివేదికలు వచ్చే ఉంటాయి. అందులో ఏముంది? అనేది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు.
ఎస్సై, మహిళా కానిస్టేబుళ్ల మధ్య పరిచయం ఉంది. ఎస్సై వద్ద కానిస్టేబుల్ పని చేసిన కారణంగా వారిద్దరి మధ్య మాటలు కలిసే అవకాశం లేకపోలేదు. కానీ ఇందులో మూడో వ్యక్తి రావడం. అతను అనూహ్యంగా వీరితో పాటే మృత్యువాత పడడంపై ఆసక్తి నెలకొన్నది. నిరుపేద కుటుంబానికి చెందిన నిఖిల్‌కు ఎలాంటి ఆధారమూ లేదు. ప్రైవేటుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసుకుంటూ బతుకుతున్నాడు. ఈ పరిస్థితిలో అర్ధాంతరంగా ఎస్సై, కానిస్టేబుళ్లతో కలిసి చనిపోవడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయంపై పోలీసులే స్పష్టతను ఇవ్వాల్సి ఉండగా ఎంతకూ పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో బాధితులు, నిందితులు, సాక్షులు అంతా మృతి చెందిన ఈ ముగ్గురే కావడంతో పోలీసులు సైతం కేసును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఎస్సై, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మూకుమ్మడి మృతి కేసును కొత్తగా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్ చంద్ర నేతృత్వంలోనైనా ఒక ముగింపును పోలీసులు అందిస్తారని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ప్రజల మాన, ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులే ఈ కేసులో భాగస్వామ్యమై ఉండడంతో జనాల్లోనూ ఆసక్తి ఏర్పడింది. అందులో ఒక ఎస్సై, మహిళా కానిస్టేబుల్ ఉండడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది.
కష్టపడి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించిన శృతి, జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఎస్సైగా ఉద్యోగం సాధించిన సాయికుమార్ ఏ కారణం వల్ల చనిపోవాల్సి వచ్చిందనేదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఈ కేసును ఛేదించడం ఇప్పుడు కామారెడ్డి పోలీసులకు కనీస బాధ్యతగా మారింది. నేర శోధనలో దేశంలో ప్రత్యేక స్థానం ఉన్నదని తెలంగాణ పోలీసులు చెప్పుకుంటున్నారు. ఈక్రమంలో సంచలన కేసును చెరువు గట్టుకే వదిలేయకుండా ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ల ఆధారంగా ప్రజలకు నిజాలను వెల్లడించి తమ సత్తాను చాటుకోవాలని ప్రజలంతా కోరుతున్నారు. గంటల వ్యవధిలోనే దొంగతనాలను, దోపిడీలను, హత్య కేసులను ఛేదించిన కామారెడ్డి పోలీసులకు ఈ కేసును సైతం తమదైన శైలిలో ఆధారాల సహితంగా ముగింపు పలకడం పెద్ద విషయమేమీ కాదు. కాకపోతే ఇందులో పోలీసులే పాత్రధారులుగా ఉండడంతో తమ శాఖ పరువును కాపాడుకునేందుకే ఈ కేసును పట్టించుకోవడం లేదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.
అడ్లూర్ ఎల్లారెడ్డి కేసులో ముగ్గురూ నీటిలో మునిగి చనిపోయారు. అయితే వారిని ఎవరైనా బలవంతంగా ముంచారా? లేదంటే ఎవరికి వారే నీళ్లలో దిగారా? వేరే వ్యక్తి ఎవరైనా వీరిని బలవంతంగా ముంచేశారా? అన్నది సాంకేతిక పరిజ్ఞానంతో కనుగొనే అవకాశం ప్రస్తుతం పోలీసులకు మాత్రమే ఉంది. ఒక వ్యక్తి నీళ్లలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తే చెరువులోని నీళ్లు నేరుగా కడుపులోకి వెళ్తాయి. తద్వారా అది ఆత్మహత్యగా నివేదికలో స్పష్టం అవుతుంది. లేదంటే చంపేసిన తర్వాత మృతదేహాన్ని నీళ్లలో పడేస్తే అప్పుడు చెరువు నీళ్లు నేరుగా డెడ్బాడీలోకి వెళ్లవు.
అప్పుడు అది హత్యగానే నిర్ధారించాల్సి ఉంటుంది. ఇలా పలు సాంకేతిక అంశాలను విశ్లేషించడం ద్వారా మృతులకు సంబంధించిన అంశాల్లో హత్య? ఆత్మహత్యనా? అన్నది తేటతెల్లం చేయొచ్చు. కానీ పోలీసులు మాత్రం ఈ కేసులో దాగి ఉన్న అంతర్లీన అంశాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు మృతి చెందిన ఈ కేసులో ఎస్సై, కానిస్టేబుల్ కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అంతో ఇంతో అండదండలు లభిస్తాయి. పోయిన ప్రాణాలను ఎవ్వరూ తీసుక రాకపోయినప్పటికీ సర్కారు నుంచి వచ్చే సహాయ, సహకారాలు ఉంటాయి.
ప్రైవేటు ఆపరేటర్‌కు మాత్రం అలాంటిదేమీ లేకపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఎస్సై, కానిస్టేబుల్‌తో ఉన్న పరిచయం నిఖిల్ ప్రాణాలను తీసినట్లయ్యింది. ముగ్గురి ప్రాణాలు పోవడానికి దారి తీసిన అంశాలను విశ్లేషించేందుకు పోలీసుల వద్ద అనేక ఆధారాలు ఉన్నాయి. అందులో ఎస్సై, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్‌కు సంబంధించిన మొబైల్ ఫోన్లను దర్యాప్తు అధికారులు సేకరించారు. వారి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎవరెవరు ఎక్కడ్నుంచి ఎక్కడికి వచ్చారు? చెరువు వద్ద ఎప్పుడు కలిశారు? వాహనం నడిపిందెవరు? అనే కోణాల్లో వివరాలు సేకరించే అవకాశం మెండుగా ఉంది. తద్వారా కాసింత కేసులో పురోగతి లభించే వీలుంది. కానీ ఈ అంశాన్ని మరుగున పెట్టేసేందుకు ఖాకీలు ఆసక్తి చూపుతున్నట్లుగా అర్థమవుతున్నది.