Nizamabad | శక్కర్ నగర్ : రోడ్డుపై ప్రయాణం చేసే ప్రతీ ఒక్కరూ రోడ్డు నియమాలు, నిబంధనలు పాటించాలని బోధన్ ఎంవీఐ డీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాసు కోరారు. జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా గురువారం బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ముందుగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆచన్ పల్లి లో నిర్వహించిన సమావేశంలో ఎంవీఐ శ్రీనివాస్ మాట్లాడారు. రోడ్డుపై ప్రయాణించే పాదాచారులతోపాటు వాహనదారులు కూడా రోడ్డు నియమాలు పాటించాలని అన్నారు.
దీంతో ప్రమాదాలు జరిగేందుకు తక్కువ అవకాశాలుంటాయని సూచించారు. ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రతి తండ్రి మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ఒకవేళ వాహనాలు ఇస్తే వారిపై కేసులతో పాటు మైనర్ల మీద కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మారిన చట్టాల ప్రకారం ప్రజలు నడుచుకోవాలని, ఒకవేళ కేసులు నమోదు అయితే జరిమానాలతో పాటు మైనర్ల భవిష్యత్తు కూడా పాడవుతోందని ఆయన సూచించారు.
పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వీటిని గుర్తించి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రిమినల్ కేసుల్లో చిన్నారులు ఇరుక్కుంటే వారి జీవితాలు అగమ్య గోచరంగా మారుతాయి అని తల్లిదండ్రులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని సరైన రీతిలో నడుచుకునేలా సూచనలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ, ఎక్సైజ్ సీఐ భాస్కరరావు తోపాటు బోధన్ డివిజన్లోని ఎస్సైలు, పోలీసులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.