ఖలీల్‌వాడి, డిసెంబర్ 9: తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ సంతకం చెరిపేస్తే చెరిగిపోయేది కాదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలిఅడుగుపడిన రోజు డిసెంబర్ 9 (విజయ్ దివస్) అని పేర్కొన్నారు. విజయ్ దివస్‌ను పురస్కరించుకొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవన్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో, నేను చస్తే శవయాత్ర, తెలంగాణ వస్తే జైత్రయాత్ర అనే నినాదంతో నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఆనాటి కేసీఆర్ దీక్ష ఢిల్లీ పీఠాన్ని కదిలించగా, డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన చేశారని, 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణతో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైందన్నారు. కేసీఆర్ అన్ని కోణాల నుంచి ఉద్యమా న్ని రగిలించి ఆమరణ నిరాహార దీక్షకు దిగారన్నారు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి, మలిదశ తెలంగాణ ఉద్యమకారునిగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోయారన్నారు.
ఆది నుంచి తెలంగాణ విలన్ కాంగ్రెస్సే..
తెలంగాణను నెహ్రూ తీసుకెళ్లి ఏపీలో కలిపిన నాటి నుంచి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటివరకూ తెలంగాణ విలన్ కాంగ్రెస్ పార్టీయేనని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. డిసెంబర్ 9 ప్రకటన నుంచి వెనకడుగు వేసిన కాంగ్రెస్ మోసంతో దాదాపు వెయ్యి మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, దీంతో తెలంగాణ గడ్డ నెత్తుటి నేలగా మారిందన్నారు. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ సిద్ధించిందే తప్ప కాంగ్రెస్ దయాదాక్షిణ్యంతో రాష్ట్రం రాలేదన్నారు.
తెలంగాణ ద్రోహి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విఫల ప్రయోగంగా చిత్రీకరించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీలు ముమ్మాటికీ తెలంగాణ ద్రోహులేనని మండిపడ్డారు. పదేండ్లుగా విభజన హామీలు అమలు చేయకుండా, నిధులివ్వకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం హింస పెడుతుందన్నారు. అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారం చేపట్టిందని, తెలంగాణ అంటే గిట్టని రేవంత్‌రెడ్డి సీఎం అయిన రోజు నుంచి మళ్లీ ద్రోహానికి బీజం పడిందన్నారు. మోదీ, చంద్రబాబు ఆదేశిస్తారని, రేవంత్‌రెడ్డి పాటిస్తారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రైజింగ్ కాదు..రాష్ట్ర సంపద క్లోజింగ్
సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే ఊదరగొడుతున్నట్లు అది తెలంగాణ రైజింగ్ కాదని, రాష్ట్ర సంపద క్లోజింగ్, స్వరాష్ట్ర అస్తిత్వం లూజింగ్ అని జీవన్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. ప్యూచర్ సిటీ పేరుతో టెంట్లు వేసి నిర్వహిస్తున్నది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కాదని, తెలంగాణ క్లోజింగ్ కాంగ్రెస్ గ్లోబెల్స్ సమ్మిట్ అని ఎద్దేవా చేశారు. భారత్ ప్యూచర్ సిటీ పేరుతో రేవంత్‌రెడ్డి హంగామా మోదీ, చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాగా ఆయన అభివర్ణించారు.
రాష్ట్రం దివాలా తీసిందని రాష్ట్రం పరువు తీసిన సీఎం రేవంత్‌రెడ్డి అప్పుల కోసం పోతే తనను బ్యాంకర్లు చెప్పులెత్తుకెళ్లే దొంగను చూసినట్లు చూస్తున్నారని తెలంగాణ ఇజ్జత్ తీసిండన్నారు. ఇలాంటి స్ట్రెచర్ లేని రేవంత్ ప్యూచర్ సిటీ కడతానంటే నమ్మేదెవరు ? అని ఆయన ప్రశ్నించారు.మోదీ, చంద్రబాబు, రేవంత్‌ను నమ్మితే తెలంగాణకు మళ్లీ బానిసత్వమేనని హెచ్చరించారు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధాని చేసే కుట్రలపై తెలంగాణ సమాజం తిరగబడాలని పిలుపునిచ్చారు. విజయ్‌దివస్ స్ఫూర్తితో కేసీఆర్ రగిలించిన ఉద్యమాగ్నితో కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు కుట్రల నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు మరో పోరుకు సన్నద్ధమవుదామని జీవన్‌రెడ్డి అన్నారు.
రెండేండ్లుగా అభివృద్ధికి నోచుకోని జిల్లా
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని జీవన్‌రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి వంటి వారున్నా అభివృద్ధి పనులు లేవని, జిల్లా అనాథగా మారిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు దమ్ముంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా ? అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో మాజీ మేయర్ నీతూకిరణ్ శేఖర్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నాయకులు సుజిత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, విశాలినిరెడ్డి, సుమనారెడ్డి, నవీద్ ఇక్బాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కేసీఆర్ హయాంలోనే ఇందూరు అభివృద్ధి
మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా
ఖలీల్‌వాడి, డిసెంబర్ 9: కేసీఆర్ హయాంలో తాను రూ.వంద కోట్లు తెచ్చి ఇందూరు నగరాన్ని అభివృద్ధి చేశానని, ప్రస్తుత అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎన్నికోట్లు తెచ్చారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా డిమాండ్ చేశారు. నిధులకు సంబంధించిన జీవో చూపించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విజయ్ దివస్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.100 కోట్ల నిధులు తీసుకవచ్చామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రకటించారని తెలిపారు.
కానీ అవి ఆయన తెచ్చినవి కాదని నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆనాటి సీఎం కేసీఆర్ జీజీ కాలేజీ గ్రౌండ్ మీటింగ్‌లో నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులు ప్రకటించారని గుర్తుచేశారు. తమ హయాంలో తెచ్చిన రూ.100 కోట్లు తాను తెచ్చానని చెప్పుకోవడం సమంజసం కాదన్నారు. గడిచిన రెండేండ్ల కాలంలో సుమారు రూ.100 కోట్లకు పైగా నిధులను తీసుకవచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ధన్పాల్ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధిలో పోటీ పడాలని హితవు పలికారు.
తెలంగాణ అంటేనే కేసీఆర్
మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్
ఖలీల్‌వాడి, డిసెంబర్ 9 : తెలంగాణ అంటేనే కేసీఆర్ అని, ఆయన వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విజయ్ దివస్‌లో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించారని అన్నారు. అనేక సంక్షే మ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమంటే తెలంగాణ లేకుండా చేయడమేనని అన్నారు.