మోర్తాడ్, జూలై 6: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) జోరుగా సాగుతున్నది. ఉమ్మడి జిల్లాలోని గ్రామగ్రామాన ‘సర్’ సందడి కనిపిస్తున్నది. అయితే, ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఫారాల భర్తీ, అవి తిరిగి ఇవ్వడంపై అనేక సందేహాలు, అనుమానాలతో ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఓటర్లకు ఫారాలు రాలేదు. వచ్చిన వారు ఏ విధంగా భర్తీ చేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఇక, భర్తీ చేసిన ఫారాలు తీసుకోవడానికి ఎవరూ రావడం లేదు. ఇలా రకరకాల సమస్యలతో ఇదేం గోస ‘సర్’ అని ఓటర్లు వాపోతున్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే జూన్ 25 నుంచి ప్రారంభమైంది. మొదట్లో బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వో) ఇంటింటికీ తిరుగుతూ ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేశారు. అయితే, మొదట్లో ఉన్న నిబద్ధత ఇప్పుడు వారిలో కనిపించడం లేదు. తాము ఉన్న చోటికే తీసుకురావాలని, ఫారాలు తీసుకురావాలని ఫోన్లు చేసి తెప్పించుకుంటున్నారు. అయితే ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసినప్పుడు పత్రాలను ఏవిధంగా భర్తీ చేయాలన్న అంశంపై అవగాహన కల్పించక పోవడంతో ఫారాల భర్తీ ప్రక్రియలో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చాలా మంది ఓటర్లకు తాము ఉన్న గ్రామాల్లో కాకుండా పక్కగ్రామాల్లో ఎన్యూమరేషన్ పత్రాలు రావడం, లేదా ఇతర గ్రామాల్లో రావడం వల్ల ఇప్పటికీ పత్రాలు అందడం లేదు. గతంలో ఆమ్లెట్ గ్రామంగా ఉన్న పల్లెలు, అలాగే ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి మారిన వారికి సంబంధించిన విషయంలో ఈ పరిస్థితి నెలకొన్నది. అయితే, బీఎల్ఏలు పత్రాల పంపిణీ సమయంలో మిగిలిన ఫారాలను అధికారులకు చూపించడంతో పక్క గ్రామాల జీపీవోలతో సదరు వ్యక్తులకు సంబంధించి విచారణ చేసి వ్యక్తి గ్రామం తెలుసుకుంటున్నారు.
అయినప్పటికీ, చాలా మందికి ఎన్యూమరేషన్ పత్రాలు అందలేదు. ఒకవేళ ఉన్న గ్రామంలో ఓటుహక్కు ఉండి, ఎన్యూమరేషన్ పత్రం వచ్చినట్లు తేలితే డబుల్ ఓటు ఉన్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. కానీ ఒక గ్రామంలో ఓటు ఉండి, మరో గ్రామంలో ఎన్యూమరేషన్ పత్రం రావడంతో ఇప్పటికీ చాలా మందికి ఎన్యూమరేషన్ పత్రాలు అందలేదు. అటువంటి వారి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే అటువంటి వారు కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలా లేదా పక్క గ్రామాల్లో వచ్చిన పత్రాలు తమకందే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.
ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేసిన బీఎల్వోలు తిరిగి పత్రాలు తీసుకోవడానికి ఇంటికి రావడం లేదు. అంతేకాకుండా తాము ఉన్నచోటుకే ఎన్యూమరేషన్ పత్రాలను తెప్పించుకుంటున్నారు. ఎన్యూమరేషన్ పత్రాల భర్తీపై అవగాహన లేక చాలా మంది అసంపూర్తిగా భర్తీ చేసు ్తన్న పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీఎల్వోలు ఇంటికి రాకుం డా ఉన్నచోటుకే తెప్పించుకోవడం, అక్కడ జనం ఎక్కువగా ఉండడం, పత్రాల భర్తీ సరిగాలేని వారి వి సరిచేయడానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి 20 ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్న వారు, ఇటీవలే వలస వచ్చిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. వలస జీవులకు తమ స్వస్థలంలో ఓటు ఉండడం లేదా 2002 నాటి ఓటరు జాబితాలో వేరే చోట పేరు ఉండడం, 2002 ఓటరు జాబితాలో కొందరి పేర్లు లేకపోవడం, మరికొంత మందికి తల్లిదండ్రులు కూడా లేకపోవడం ఇలా రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్నేండ్లుగా ఇక్కడే ఓటు వేస్తున్న తమకు వేరే ప్రాంతాల్లో ఓటు లేకున్నా 2002లో ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో పత్రాలు ఎలా నింపాలో తెలియక సతమతమవుతున్నారు.
ఇలాంటి సమస్యలు ఉన్న వారి పత్రాలను తర్వాత తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. సమస్యగా ఉన్న వారికి సంబంధించిన పత్రాలను తీసుకోకపోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ‘ఇంతకు మాకు ఓటు వస్తుందా?’ అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న కొందరి తల్లిదండ్రులు కాలం చేయడం, వారి పేరు ఇక్కడి ఓటరు జాబితాలో ఉండకపోవడం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వారి సమస్యలకు అధికారులే పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు.