కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2019లో ఇంగ్లిష్ మీడియం తరగతుల బోధన ప్రారంభించారు. మొదట ఆరో తరగతికే పరిమితం కాగా విద్యార్థుల ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రస్తుతం 6,7,8 తరగతులకు ఉపాధ్యాయులు ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు చెబుతున్నారు. ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం ప్రైవేటు పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించే బదులు ప్రభుత్వ బడిలోనే ఆ సౌకర్యం ఉచితంగానే అందిస్తుండడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను చేర్పిస్తున్నారు.
నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్తుమ్మెదలో కొనసాగుతున్న ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివేందుకు చుట్టు పక్కల ఎనిమిది గ్రామాల విద్యార్థులు వస్తుంటారు. మాల్తుమ్మెద పాఠశాలకు గోపాల్పేట్, వదల్పర్తి, కన్నారెడ్డి, ధర్మారెడ్డి, బంజార, చీనూర్, వెంకంపల్లి, పోచారం గ్రామాల నుంచి ఇంగ్లిష్ మీడియం చదివేందుకు వస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు – మన బడి పేరుతో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టనుండడంతో ఎనిమిది గ్రామాల విద్యార్థులకు దూరభారం తగ్గనున్నది. ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదివేందుకు విద్యార్థులు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని మాల్తుమ్మెద పాఠశాలకు వెళ్లాల్సి వస్తున్నది. ప్రభుత్వం సొంతూళ్లోనే ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తెస్తుండడంతో ఆ తిప్పలు తప్పనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో మాల్తుమ్మెదకు వచ్చే ఎనిమిది గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు ఆ పాఠశాలలోని ఐదు తరగతుల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 90. ఇప్పుడు కేవలం మూడు తరగతుల్లో 90మంది విద్యార్థులు. కేవలం తొమ్మిది మంది విద్యార్థులతో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించిన ఆ పాఠశా ల ముఖచిత్రమే మారిపోయింది. అప్పటి వర కు ప్రైవేటు పాఠశాలల్లో భారీ ఫీజులు కడుతూ విసిగివేసారిన తల్లిదండ్రులు సమీపంలోని పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం బోధిస్తుండడంతో వారి పిల్లలందరినీ ప్రభుత్వ బడికే పంపిస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన చేస్తుండడంతో అందరి దృష్టీ ఈ పాఠశాలపైనే పడింది.
మా పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులకు డబ్బుల భారం తప్పింది. ఉచితంగా నాణ్యమైన విద్య అందించడంతో ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నరు. ప్రైవేట్ పాఠశాలలో వేలకు వేలు ఫీజులు కట్టి విద్యార్థులను చదివించే స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడం..నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందించడం విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వరం.
– ఉమారాణి, ప్రధానోపాధ్యాయురాలు, మాల్తుమ్మెద జడ్పీహెచ్ఎస్
పోటీ ప్రపంచంలో ఎదగాలంటే మా పిల్లలకు ఇంగ్లిష్ మీడియం అవసరం. దీంతో భారీ మొత్తంలో ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నాం. మాల్తుమ్మెద ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ఉందని మా పాపను పంపిస్తున్నాం. ప్రభుత్వం తాజా నిర్ణయంతో సొంతూళ్లోనే ఇంగ్లిష్ మీడియం ప్రారంభమవుతుండడం చాలా సంతోషంగా ఉంది.
– మహేందర్, కన్నారెడ్డి ,విద్యార్థి తండ్రి