Softball competitions | శక్కర్ నగర్ : జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన బోధన్ మండలం సంగం గ్రామానికి చెందిన భానోత్ చందుకు విశ్రాంత ఎంఈఓ బాలగంగాధర్ తనవంతు సాయాన్ని అందజేశారు. ఇటీవల మెదక్ లో నిర్వహించిన సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభను చాటి జాతీయస్థాయి పోటీలకు నిజామాబాద్ జట్టు ఎంపికైంది.
ఈ జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న బానోత్ చందు ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థి కాగా నిరుపేద కుటుంబం అయినందున అతనికి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో తనవంతుగా 5000 రూపాయలు అందించానని బాలగంగాధర్ తెలిపారు. ఈనెల 29 నుంచి చండీఘర్ లో ప్రారంభమయ్యే జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు చందు వెళ్తున్న సందర్భంగా తాను, తనతో పాటు బోధన్ కు చెందిన వ్యాపారి వెంకటేశం సదరు విద్యార్థికి కొంత నగదును అందజేశారు.
సంగం గ్రామ సర్పంచ్ బానోత్ చందు విషయంలో తమకు చెప్పడంతో ఈ సాయం అందజేశామని, రాబోయే రోజుల్లో అతన్ని మంచి క్రీడాకారునిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చాలని బాలగంగాధర్ అన్నారు, జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో సత్తాను జాతీయ స్థాయి పోటీలో చాటాలని కోరుతూ భానోత్ చెందును బాలగంగాధర్, వెంకటేశం లు అభినందించారు.