నిజామాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉన్నతాధికారి తీరుతో కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు అధికారి చర్యలతో విసుగు చెందిన వారు.. ఇలా అయితే తాము పనిచేయలేమని అంటున్నారు. కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు మూకుమ్మడి సెలవులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఓ అధికారి తీరుతో విసుగు చెందుతున్న వారంతా ఐక్యంగా ఓ నిర్ణయానికి వస్తున్నట్లు తెలిసింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా సిబ్బందిని టార్చర్ చేస్తున్న అధికారి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తంఅవుతున్నది. ఏడాది కాలంగా సతమతం అవుతున్నప్పటికీ ఎవ్వరికీ చెప్పుకోలేక భరిస్తూ వస్తున్నారు. కాగా ఈ మధ్య వేధింపులు మరీ ఎక్కువ కావడంతో చేసేదేమీ లేక సామూహిక సెలవులు పెట్టి, అతడి వేధింపుల నుంచి ఉపశమనం పొందేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ..
వారి సంక్షేమం కోసం పని చేయాల్సిన వ్యవసాయ శాఖలోని సదరు అధికారి తీరుతో ఉద్యోగులంతా ఏకమవ్వడంపై సర్వత్రా చర్చ నడుస్తున్నది. ఏఈవోలు, ఏవోలు, ఆఫీస్ స్టాఫ్ కూడా అధికారి ప్రవర్తనతో బాధితులుగా మారినట్లుగా తెలుస్తున్నది. ప్రతి చిన్న విషయానికీ పని కట్టుకుని వేధించడం, పదే పదే ప్రశ్నలు వేస్తూ సతాయించడం, సంజాయిషీ పేరుతో కార్యాలయం చుట్టూ తిప్పుకోవడమే కాకుండా ఇతరత్రా అనైతిక కార్యక్రమాలకు ఉసిగొల్పుతుండడంపై సర్వత్రా వ్యతిరేకత ఏర్పడింది.
గతంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పని చేసిన సమయంలోనూ ఏవో, ఏఈవో, ఆఫీస్ స్టాఫ్ నుంచి ఇదే తీరుగా వ్యతిరేకతను మూటగట్టుకున్న సదరు అధికారి ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోనూ అదే తరహాలో పని చేస్తూ ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే సామూహికంగా సెలవులు పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. నేడు లేదా రేపు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్‌ను కలిసి తమ బాధలను చెప్పుకునేందుకు వ్యవసాయ శాఖ ఉద్యోగులు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
ఫర్టిలైజర్ దుకాణాదారులకూ తప్పని వేధింపులు..
వ్యవసాయ శాఖ ఉద్యోగులతోపాటు సదరు అధికారితో కామారెడ్డి జిల్లాలోని పలు చోట్ల విత్తన, ఎరువు దుకాణాదారులు సైతం తీవ్ర వేధింపులకు గురవుతున్నట్లు సమాచారం. తనిఖీలు నిర్వహిస్తే తమకేమీ బాధ లేదని ఎరువులు, విత్తన దుకాణాదారులు చెబుతున్నారు. అనుమతుల్లేని వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంటున్నారు. సక్రమంగా కార్యకలాపాలు నిర్వహించే తమను అకారణంగా వేధించడం, పలు విధాలుగా టార్గెట్లు పెట్టడం ఏమిటని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించాలని ఓ వైపు వ్యవసాయ శాఖ ఉద్యోగులు, సిబ్బందితో పాటు మరోవైపు విత్తన, ఎరువుల వ్యాపారులు కోరుతున్నారు.
సదరు అధికారి నుంచి విముక్తి ప్రసాదించాలంటున్నారు. కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పలువురు వ్యవసాయాధికారులు బాహాటంగానే చెబుతున్నారు. సదరు అధికారి అనైతిక తంతుపై ఉన్నతాధికారులకు సైతం ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. వ్యవసాయ శాఖలో నెలకొన్న అంతర్గత కల్లోలం, ఉద్యోగులకు ఓ అధికారికి మధ్య తలెత్తిన వివాదంపై కలెక్టర్ లేదా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. తప్పు చేసిన వారిని గుర్తించి దండిస్తారా? లేదా గాలికి వదిలేస్తారా? అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.
కన్నీళ్లు పెట్టుకుంటున్న ఉద్యోగులు…
గతంలో ఎప్పుడూ ఏ అధికారి వద్దా చూడని ప్రవర్తనను ప్రస్తుతం ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా పలువురు మండల వ్యవసాయాధికారులు, మండల విస్తర్ణాధికారులు వాపోతున్నారు. పని చేసే ప్రాంతంలో మంచి వాతావరణం ఉంటే రైతులకు అండదండగా నిలిచేందుకు వీలుంటుంది. సరైన వాతావరణం లేనప్పుడు ఉద్యోగులు మనసు పెట్టి పని చేసే అవకాశం లేకుండా పోతున్నది. అలాంటి దుస్థితి కామారెడ్డి వ్యవసాయ శాఖను చుట్టేసింది. విమర్శలు ఎదుర్కొంటున్న అధికారిల తీరుతో చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇష్టానుసారంగా ఆంగ్ల పదాలను వాడుతూ బూతులు తిడుతున్నట్లు ఏవోలు బాధ పడుతున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడడంతోపాటు నిబంధనలకు వ్యతిరేకంగా పని చేయాలంటూ ఒత్తిడి చేయడంలో మతలబు ఏమిటి? అని సదరు అధికారి తీరుపై ఏఈవో, ఏవోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.