కంఠేశ్వర్, జూన్ 10: నిజామాబాద్‌లో (Nizamabad) గాలి వాన బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకు నగరంలో చాలాచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లపై భారీ చెట్లు పడటంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో రాత్రంతా నగరం మొత్తం అంధకారంలో మునిగిపోయింది. నగరంలోని కంఠేశ్వర్, రైల్వే స్టేషన్ రోడ్, ఖలీల్‌వాడి కులం చౌరస్తా, వినాయక్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ మొత్తంలో చెట్లు నేలకూలియాయి. విద్యుత్ అధికారులు జేసీబీల సహాయంతో చెట్లను తొలగించి విద్యుత్‌ను కొంతమేర పునరుద్ధరించారు.
పూలంగ్ చౌరస్తాలోని టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, వినాయక్ నగర్లో చెట్లు పడిపోవడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. వినాయక్ నగర్లో గాలి వాన బీభత్సానికి భారీ చెట్టు ఓ రేకుల షెడ్డుపై కూలిపోవడంతో అక్కడే ఉన్న బోర్గం విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ దుర్మరణం చెందారు. భారీ వర్షాలు, ఈదురు గాలులు ఉన్న నేపథ్యంలో ప్రజలు పాత భవనాలు, షెడ్లు, భారీ చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.