బోధన్, జూన్ 9 : రాష్ట్ర మంత్రివర్గం విస్తరణ జిల్లా కాంగ్రెస్‌లో కల్లోలం రేపింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి మంత్రివర్గం విస్తరణలో చోటు దక్కకపోవడంపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం తీరుపై బోధన్ నియోజవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. నిరసన వ్యక్తంచేస్తూ తమ పార్టీ పదవులు, నామినేటేడ్ పోస్టులకు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. సోమవారం హైదరాబాద్‌కు తరలివెళ్లి రాజీనామాలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు సమర్పించారు.
హైదరాబాద్‌కు పెద్ద సంఖ్యలో వెళ్లిన బోధన్ కాంగ్రెస్ నాయకులు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆయన ఢిల్లీకి బయల్దేరడంతో ఇంటివద్ద నిరసన తెలిపి రాజీనామాలను వాచ్‌మన్‌కు సమర్పించారు. పీసీసీ అధ్యక్షుడితో పాటు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్రం ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు ట్విట్టర్, వాట్సాప్‌ల ద్వారా తమ రాజీనామాలను పంపారు. సుదర్శన్‌రెడ్డికి వచ్చే స్థానిక ఎన్నికల్లోపు మంత్రి పదవి ఇవ్వకపోతే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమయ్యే ప్రమాదముందంటూ కాంగ్రెస్ అధిష్టానానికి హెచ్చరికలను బోధన్ కాంగ్రెస్ నాయకులు పంపడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్‌కు గడ్డుకాలమే..
వాస్తవానికి జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న సుదర్శన్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కుతుందని ఆయన అభిమానులు, అనుచరులు ఆశించారు. మంత్రివర్గం విస్తరణ తర్వాత కూడా పెద్దాయనకు మంత్రి పదవి ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుందంటూ ప్రచారం జరిగింది. ఒక దశలో ఆయనకు హోంశాఖ మంత్రి పోర్ట్‌పోలియో ఖాయమైనట్లు సంకేతాలూ వచ్చాయి. మంత్రి కాకపోయినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఆయనకు ఒక మంత్రికి ఇచ్చే ప్రొటోకాల్‌ను అనధికారికంగా ఇస్తూ వచ్చింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం మంత్రివర్గం విస్తరణ జరగగా, ఈసారి మంత్రిపదవి ఖాయమని అంతా భావించారు. ఊహించనిరీతితో మంత్రివర్గం విస్తరణలో పెద్దాయనకు బెర్త్ దక్కలేదు. ఇదే కాంగ్రెస్ వర్గాల్లో ఆగ్రహావేశాలకు దారితీసింది. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం సుదర్శన్‌రెడ్డికి ఉన్నది. కీలకమైన భారీ నీటిపారుదలశాఖ, వైద్యవిద్యాశాఖ పోర్ట్‌పోలియోలను ఆయన నిర్వహించారు.
మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమి చెందినప్పటికీ 2023లోజరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. సీనియర్ నేతగా ఉన్న తమ నేత సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవికి అన్ని అర్హతలు ఉన్నాయని, అటువంటి నేతకు మంత్రివర్గంలో అవకాశం కల్పించకపోవడం శోచనీయమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
నిన్నమొన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటూ విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడం.. ఇప్పటికే జిల్లా అభివృద్ధి కుంటుపడిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణ తీరును రాజకీయ పరిశీలకులు తప్పుబడుతున్నారు. ఈ పరిణామాలన్నీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యే గడ్డుకాలాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గం విస్తరణతో జిల్లా కాంగ్రెస్‌లో.. ముఖ్యంగా బోధన్ కాంగ్రెస్ వర్గాల్లో ఏర్పడిన ప్రకంపనలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది..
మంత్రి పదవి ఇవ్వకపోతే జిల్లాలో కాంగ్రెస్ భూస్థాపితమే
సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో భూస్థాపితం అయ్యే ప్రమాదముందంటూ బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు పంపడం ఆ పార్టీలో ఏర్పడిన కల్లోలానికి అద్దం పడుతుంది. సోమవారం హైదరాబాద్‌కు వెళ్లి పార్టీ పదవులు, నామినేటేడ్ పదవులకు రాజీనామాలు చేసిన వారు బహిరంగంగానే ఈ హెచ్చరికలు చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లోగా మంత్రిగా సుదర్శన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని, లేకపోతే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అవుతందన్న భయాందోళలను వ్యక్తంచేశారు.
హైదరాబాద్‌లోని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఇదే విషయాన్ని ఫోన్‌చేసి అల్టిమేటం ఇచ్చారు. రాజీనామాలు చేసిన ప్రముఖుల్లో కాంగ్రెస్ బోధన్ నియోజకవర్గంలోని మండలాల అధ్యక్షులు బి.గంగాశంకర్, పాషా మొయినుద్దీన్, మోబిన్‌ఖాన్, శ్రీనివాస్‌గౌడ్, డి.నాగేశ్వర్రావు, మందర్న రవి, పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.నరేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చీలం శంకర్, బోధన్ శివాలయం చైర్మన్ హరికాంత్‌చారి, పార్టీ నాయకులు తూము శరత్‌రెడ్డి, అల్లె రమేశ్, చిన్నా, అశోక్ తదితరులు ఉన్నారు.