పోతంగల్, జూన్ 10: పోతంగల్ మండలంలో (Pothangal) సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో మండలంలో పలు గ్రామాలల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పోతంగల్, బోధన్ వెళ్ళే దారిలో చెరువు వద్ద రోడ్డు ప్రక్కన ఉన్న చెట్లు విరిగిపడటంతో కొద్దిసేపు వాహన దారులకు అంతరాయం ఏర్పడింది. మండల కేంద్రంలో పాత పోతంగల్ వెళ్ళే దారిలో విద్యుత్ స్తంభాలు నెలకు ఒరిగాయి. మండలంలోని జల్లాపల్లి, కల్లూరు, కొల్లూరుతోపాటు పలు గ్రామాల్లో స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అధికారులు, సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు.