నమస్తే తెలంగాణ యంత్రాంగం, నవంబర్ 30 : జిల్లాలోని రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు మౌలిక వసతులు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు తమ స్వస్థలాల్లో కుటుంబీకులతో కలిసి ఓటు హక్కునువినియోగించుకున్నారు. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేశారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
నిజామాబాద్ అర్బన్‌లోని ఎస్ఆర్ స్కూల్లో బీఆర్ఎస్ అర్బన్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా, సిరికొండ మండలంలోని రావుట్ల జడ్పీహెచ్ఎస్లో బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాక్లూర్ మండలం వెంకటాపూర్‌లో జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, డిచ్పల్లి మండలం రాంపూర్‌లో మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ తమ కుటుంబీకులతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కోటగిరి మండలకేంద్రంలోని హైస్కూల్, ఎస్సీ కాలనీలోని పోలింగ్ కేంద్రాలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పోలింగ్ శాతాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి ఉన్నారు.
డిచ్పల్లి మండలంలోని ఘన్‌పూర్‌లో 10 నిమిషాలు, కమలాపూర్‌లో 20 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనా.. పోలింగ్ శాతం పుంజుకున్నది. డీఎల్పీవో నాగరాజు ఆయా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఈవీఎంలను సరి చేయించారు. సుద్దపల్లిలో దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. సారంగాపూర్‌లోని పోలింగ్ కేంద్రాలను నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్, సుద్దులంలోని కేంద్రాన్ని బీఎస్ఎఫ్ డీఎస్పీ నితీశ్ కుమార్ పరిశీలించారు.
నగరంలోని శివాజీనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన 148 పోలింగ్ నంబర్ బూత్‌లో ఉదయం 7 గంటలకు ఈవీఎం మొరాయించింది. అప్పటికే సెంటర్ వద్దకు వచ్చిన ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మిషన్‌ను సరిచేయడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మోస్రాలో 77 శాతం, కోటగిరిలో 81 శాతం, పొతంగల్‌లో 82 శాతం, రూరల్‌లో 83.7శాతం, సిరికొండలో 77. 06 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఇందల్వాయి మండలంలోని త్రియంబక్‌పేట్ తండాకు చెందిన సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. ఓటు వేసే సమయంలో కెమెరా ఫోన్‌తో ఫొటో తీసినందుకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఓటుహక్కును వినియోగించుకున్న అనంతరం గుండెపోటుతో వృద్ధుని మృతి
నిజామాబాద్ రూరల్, నవంబర్ 30 : మండలంలోని పాల్దా గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన గోనె భోజన్న (75) గురువారం ఉదయం గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇంటికి వచ్చి కూర్చోగా.. ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.