నిజామాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సరిగ్గా ఆరు నెలలు పూర్తయ్యింది. డిసెంబర్ 7న కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో హామీల అమలు అన్నది ఒకడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. ఆరు గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇకపై పూర్తిస్థాయి పరిపాలనపై దృష్టి పెట్టబోతున్నది. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా? లేదా? అన్నది ప్రజల్లో అయోమయానికి దారి తీస్తున్నది. పేదలు, మధ్యతరగతి వర్గాలతోపాటు మహిళలు, రైతులు కాంగ్రెస్ తీరుపై ఇప్పటికే నొచ్చుకుంటున్నారు.
హామీలను అమలు చేయలేక చతికిల పడుతున్న దరిమిలా పాత ప్రభుత్వం అందించిన పింఛన్లను, రైతుబంధును మాత్రమే అమలు చేస్తున్నది. రైతుభరోసా, మహాలక్ష్మి పథకాల జోలికి ఇంత వరకూ వెళ్లలేదు. ఎన్నికల కోడ్ ముసుగులో కాంగ్రెస్ పాలకులు రెండు నెలల పాటు తాత్సారం చేసినప్పటికీ ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిపాలన జోరును చూపించేందుకు ఉత్సాహం చూపుతున్నందున ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలంతా వేడుకుంటున్నారు. స్తబ్ధుగా మారిన పరిపాలనను పట్టాలెక్కించాలని కోరుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జనాలంతా డిమాండ్ చేస్తున్నారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి కుటుంబంలోని మహిళలకు రూ.2500 అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మహాలక్ష్మిలో కేవలం ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఒక్కటే అమలైంది. మహిళలకు ఆర్థిక సాయం పత్తా లేకుండా పోయింది. 18 ఏండ్లు నిండిన వారందరికీ నెలకు రూ.2500 చెల్లిస్తామని భారీ ప్రకటనలు చేసి ఇప్పుడేమో పట్టించుకోకపోవడం ఏంటని మహిళాలోకం కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నది. ఇదిలా ఉండగా పింఛన్ల సంగతి అతీగతీ లేకుండా పోయింది.
కేసీఆర్ ప్రభుత్వంలో నెల రాగానే ఠంఛనుగా పింఛన్ డబ్బులు చేతికి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి కానరావడం లేదు. నెలకు రూ.4వేలు పింఛన్ ఇస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఈ హామీపై నోరెత్తడం లేదు. ఎప్పటి నుంచి అమలు చేస్తారో? కూడా స్పష్టంగా చెప్పకలేకపోతున్నది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు రూ.500 బోనస్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించింది. కానీ బోనస్ అంతా బోగస్ అన్నట్లుగా యాసంగిలో చేతికొచ్చిన వడ్లకు వర్తింపజేయలేదు.
వానాకాలం నుంచి సన్నాలకే ఇస్తామంటూ దాటవేశారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకంలోనూ లోపాలు బహిర్గతం అవుతున్నాయి. రేషన్‌కార్డు లేని పేద కుటుంబాలకు ఈ పథకం వర్తించడం లేదు. ఈ పథకం కింద సగం మందికి మాత్రమే లబ్ధి చేకూరగా చాలా మందిని నిరుత్సాహమే వెంటాడుతున్నది. డిసెంబర్ 9, 2023లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఈ ప్రక్రియ చేపడతామన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఆగస్టు 15, 2024 అంటూ ప్రకటన చేశారు. రైతులంతా రూ.2లక్షల మాఫీ కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ పాలకులు ఏంచేస్తారోనని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రభుత్వ యంత్రాంగంలో నిర్లిప్తత ఆవరించింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బదిలీలను చేపట్టింది. ఆ తర్వాత ఈసీ రంగంలోకి దిగి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులను మార్చింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో మరోసారి బదిలీల పర్వం కొనసాగనున్నది. ముఖ్యంగా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతోపాటు కిందిస్థాయిలోని కీలకమైన అధికార యంత్రాంగమంతా తారుమారు కానున్నారు. ఈసీ ఆదేశాలతో పక్క జిల్లాల నుంచి వచ్చి పనిచేస్తున్న వందలాది మంది అధికారులంతా తిరిగి తమ చోటికి వెళ్లేందుకు ఇప్పటికే పైరవీలు షురూ చేసుకుంటున్నారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో సహా వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారంతా స్థానచలనం కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్‌లో రింగ్ లీడర్లుగా పేరొందిన వారి చుట్టూ తిరుగుతున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట నియోజకవర్గ ఇన్చార్జీలను ప్రసన్నం చేసుకుంటున్నారు. వారిని ప్రసన్నం చేసుకోవడంతోపాటు నచ్చిన పోస్టింగ్‌ను దక్కించుకునేందుకు పాకులాడుతున్నారు. పోలీస్ శాఖలో ఎస్సై, సీఐ, ఏసీపీ/డీఎస్పీ, అదనపు డీసీపీ/అదనపు ఎస్పీ, సీపీ/ఎస్పీ స్థాయి పోస్టులకు సైతం జోరుగా పైరవీలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారులకు బదిలీ తప్పదనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈసీ నియామకం ద్వారా బాధ్యతలు చేపడుతున్న కీలక అధికారి పనితీరును కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోవడం లేదని చర్చ నడుస్తున్నది. ఇందులో భాగంగా ఆయనను తప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం. బదిలీలు తప్పదనే కారణంతో యంత్రాంగంలో అడుగడుగునా స్తబ్ధత కనిపిస్తున్నది.