విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. దీంతో మంగళవారం బస్సులు, బస్టాండ్లు కిక్కిరిశాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్సుల్లో సీట్లు కాదు కదా.. కాలు పెట్టేందుకు స్థలం దొరకక అవస్థలు పడ్డారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కళకళలాడాయి.
కామారెడ్డి, అక్టోబర్ 1: బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా నేటి నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 2 నుంచి 14వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు కామారెడ్డి డీఈవో రాజు మంగళవారం తెలిపారు. అక్టోబర్ 15న స్కూళ్లు పునఃప్రారంభమవుతాయన్నారు. సెలవు రోజుల్లో ఎవరైనా ప్రైవేట్ తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు.