నిజామాబాద్, డిసెంబర్ 22, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో మెడికల్ షాపులపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతం లో పలు చోట్ల ఆకస్మికంగా నిర్వహించిన తనిఖీల్లో లోటుపాట్లు బహిర్గతం అయ్యాయి. పలు షాపుల్లో నిబంధనలు పాటించకపోవడాన్ని డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు 8 దుకాణాలకు తాఖీదులు పంపించారు.
“అటకెక్కిన ఔషధ తనిఖీలు…” శీర్షికతో సోమవారం నమస్తే తెలంగాణలో జిల్లా సంచికలో ప్రచురితమైన కథనానికి ఔషధ నియంత్రణ శాఖ ఏడీ డా.ఎన్.నర్సయ్య స్పందించారు. నిజామాబాద్ అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వి.శ్రీకాంత్, నిర్మల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్యామ్లతో బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు. మెడికల్ షాపుల్లో రికార్డుల నిర్వహణ, ఔషధ నిల్వలకు సంబంధించి డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపట్టగా పలు చోట్ల నిబంధనలు పాటించడం లేదన్న విషయాన్ని గుర్తించారు. నిర్వాహకులను మందలించడంతో పాటు 8 మందికి నోటీసులు జారీ చేశారు.
ఫార్మాసిస్ట్లు లేకపోవడం, సేల్ బిల్స్ చూపకపోవడం వంటివి వెలుగు చూడడంతో పాటు ఔషధాల క్రయ, విక్రయాలకు సంబంధించి రిజిస్టర్లు అందించకపోవడంపై కొరఢా ఝులిపించారు. మెడికల్ షాపుల నిర్వాహకులు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించాలని ఔషధ నియంత్రణ శాఖ ఏడీ డా.ఎన్.నర్సయ్య హెచ్చరించారు. డాక్టర్ల పిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం చట్ట రీత్యా నేరమన్నారు. ఫార్మాసిస్టులను విధిగా ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. నిరంతరం తనిఖీలు చేపడుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీల్లో అక్రమాలు జరిగితే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. యాంటీ బయోటిక్స్ విచ్చలవిడిగా విక్రయించొద్దని నిబంధనల మేరకు మాత్రమే ప్రజలకు అందివ్వాలన్నారు.