కంఠేశ్వర్, ఫిబ్రవరి 28: తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ మహిళలు ఖాళీ బిందెలతో బోధన్, నిజామాబాద్ ప్రధాన రహదారిపై శుక్రవారం నిరసన వ్యక్తంచేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమస్యను పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలోదని మండిపడ్డారు. ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా ఫలితంలేకుండా పోయిందని, తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వేదన వ్యక్తం చేశారు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఒకసారి తమ కాలనీని సందర్శించాలని కోరారు.
డివిజన్లో రెండు మినీ వాటర్ ట్యాంకులున్నా నిరుపయోగంగా ఉన్నాయని, బోరుమోటర్లు కాలిపోయినా పట్టించుకునే నాథుడు లేడన్నారు. తాగునీటి సమస్యతోపాటు మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తున్నదని వాపోయారు. నాయకులకు ఎన్నికల్లో మాత్రమే తాము గుర్తుకువస్తామని, ఈసారి ఎన్నికల్లో ఎవరైనా ఓట్లు అడగడానికి వస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. డివిజన్లోని సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు.
తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతు న్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఉద యం, సాయంత్రం రెండు పూటలా రెండు గంటలపాటు నీటిని సరఫరా చేయాలి.
-గంగామణి
గతంలో తాగునీటి కోసం ఇలాంటి ఇబ్బందులు ఎ ప్పుడూ పడలేదు. ఇప్పు డే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికై నా అధికారులు స్పం దించి నీటి సమస్యను పరిష్కరించాలి.
-పల్లెపు నీల