నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 4: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతోపాటు వర్షం కురిసింది. రామారెడ్డిలో కామారెడ్డి-భీమ్గల్ ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో ట్రాఫిక్ జామ్ కాగా.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని రోడ్డుపై పడిన చెట్టును తొలగించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో మధ్యాహ్నం గంటపాటు వర్షం కురిసింది. ఆర్మూర్ పట్టణంలో గాలీవాన బీభత్సం సృష్టించింది. గంటపాటు జోరు వర్షం కురిసింది. నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామంలో పిడుగుపాటుకు ఓ ఆవు మృతి చెందింది. ధర్పల్లి మండలంలో కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇందల్వాయి, సిరికొండ మండలాల్లో ఈదురుగాలులతోపాటు వర్షం కురిసింది. గడ్కోల్లో తాటిచెట్టుపై పిడుగుపడింది.
డిచ్పల్లి మండల కేంద్రంలోని సీఎంసీలో మంగళవారం పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించిన విషయం విదితమే. కాగా మధ్యాహ్న సమయంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సీఎంసీ వద్ద వేసిన టెంట్లు ఎగిరిపోయాయి. కొద్దిసేపు కారుమబ్బులు కమ్ముకోగా.. చిరుజల్లులు కురిశాయి.