నిజామాబాద్, ఏప్రిల్ 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి పంట కాలం మరికొద్ది రోజుల్లోనే పరిసమాప్తం కానుంది. అనేక చోట్ల వరి కోతలు షురూ అయ్యాయి. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. ఇప్పటి వరకు పెట్టుబడి సాయం పూర్తి స్థాయిలో అందలేదు. రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రె స్ పార్టీ నెరవేర్చడం లేదు. ప్రభుత్వంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రైతుభరోసా పథకం అమలు అన్నది అతీగతీ లేకుండా పో యింది.
యాసంగి 2026లో పెట్టుబడి సా యం సమయానికి జమ కాలేదు. కర్షకులు కన్నెర్ర చేయడంతో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వం దిగొచ్చి ఏప్రిల్ 22న సీఎం రేవం త్ రెడ్డి తొలి విడత నిధులు రిలీజ్ చేశారు. 15 రోజుల తర్వాత రెండో విడత సాయం అందిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తొలి విడతలో రైతులందరికీ కేవలం ఎకరానికి మాత్రమే పెట్టుబడి సాయా న్ని అమలు చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులో తుది విడతలో మిగిలిన భూమికి సాయం చేస్తామని ప్రభుత్వం ఢంకా బజాయించి చెప్పింది. సీఎం చెప్పిన 15 రోజుల గడువు రానే వచ్చింది. రైతు భరోసా అమలుపై హడావిడి మొదలు కాలేదు. ఇంకెప్పుడు నగదు జమ చేస్తారు మహాప్రభూ…? అంటూ రైతులంతా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
సన్న, చిన్నకారు రైతులకే నష్టం…
బీఆర్ఎస్ హయాంలో ప్రతి రైతుకు రైతుబంధు పథకాన్ని సమయానికి అందించారు. పంట కాలం మొదలు అవుతుందనేలోపే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేది. ఆ సమయంలో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లుగా మాట్లాడాడు. ఏడాదికి మూడు పంటలకు రైతుబంధు అమలు చేయాలని రెచ్చగొట్టాడు. పెద్ద రైతులకు పెట్టుబడి సాయం ఎందుకు? అని ప్రశ్నించాడు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చెప్పిన డైలాగులను పూర్తిగా రేవంత్ రెడ్డి మర్చిపోయినట్లే కనిపిస్తోంది. ఏడాదికి మూడు పంటలకు పెట్టుబడి సాయం చేయాలని చెప్పిన వ్యక్తి… ఇప్పుడు ఒక సీజన్‌కైనా సరిగా నగదు సాయం అందివ్వకపోవడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతుభరోసా పథకం అమలులో జాప్యం మూలంగా సన్న, చిన్నకారు రైతులకే అత్యధికంగా నష్టం వాటిల్లుతోంది.
పెట్టుబడి సాయం డబ్బుతో నష్టాలు పూడ్చుకుని గట్టెక్కే పరిస్థితి రైతులకు ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్ట పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతుభరోసా యాసంగి 2026 సీజన్లో తొలి విడతలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 5.69లక్షల మంది రైతులకు నగదు జమ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 2లక్షల 69వేల 476 మంది రైతులకు ఎకరానికి రూ.6వేలు చొప్పున రూ.134.95కోట్లు నిధులు విడుదల చేశారు. కామారెడ్డి జిల్లాలో 3లక్షల 294 మంది రైతులకు ఎకరానికి రూ.6వేలు చొప్పున రూ.139.42కోట్లు అందించారు. చిన్న, సన్నకారు రైతులకు గ్రామాల్లో 2 నుంచి 5 ఎకరాల సాగు భూమి ఉంది. వీరికి వ్యవసాయమే జీవనాధారం. సామాన్య రైతులంతా రెండో విడత ద్వారా పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం అందివ్వాలంటూ కోరుతున్నారు.
బాకీ డబ్బులు ఎప్పుడిస్తారు?
కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రైతులను మోసగిస్తోంది. అనుకూల మీడియాలో తప్పుడు కథనాలతో ప్రజలను గందరగోళంలోకి నెడుతోంది. ఫేక్ ప్రచారాలతో కాలం వెళ్లదీస్తూ ఉల్టా చోర్ కొత్వాల్‌కో ఢాంకే అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. రైతుభరోసా అమలు ఎప్పుడు? అని ప్రశ్నిస్తే రైతులపైనే తిరగబడి దాడులు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై మాటెత్తడం లేదు. చీటికి మాటికి కేసీఆర్‌పై విధ్వేషపు ప్రసంగాలు చేసి కాలం వెళ్లదీస్తున్నారు. రైతుల నుంచి వ్యతిరేకత వెలుగు చూడగానే బీఆర్ఎస్ అధినేతపై బూతులు తిట్టడానికే ముఖ్యమంత్రి పరిమితం అవుతున్నారు. రైతులకు పెట్టుబడి సాయం, ఆత్మీయ భరోసా, ధాన్యం కొనుగోళ్లు, బోనస్ చెల్లింపు వంటి వాటిపై నోరు మెదపడం లేదు.
జనాల మైండ్ సెట్‌ను డైవర్ట్ చేసేందుకు అనుకూల పత్రికలతో రాష్ట్రంలో మైండ్ గేమ్‌ను రేవంత్ రెడ్డి సర్కారు ఆడిస్తోందని రైతులంతా పసిగట్టారు. ఈ ఫేక్ ప్రచారాలపై ఇప్పటికే కర్షకులంతా కన్నెర్ర చేస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం పూర్తిగా చెల్లిస్తామంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ముందు భారీ ప్రకటనలు చేసి ఓట్లు లాక్కున్నారు. తీవ్ర జాప్యంతో ఎకరానికి రూ.6వేలు చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందించారు. పూర్తి స్థాయిలో నగదు అందివ్వలేదు. రెండు, మూడో విడత రైతుభరోసా అమలుకై రైతన్నలు ఎదురు చూస్తున్నారు.
యాసంగి ముగుస్తున్నా రైతు బంధు రాలేదు
సిరికొండ, ఏప్రి ల్ 6: యాసంగి నాట్లు వేసే టైంల ఇయ్యాల్సిన రైతు భరోసా పంట కోత లు మొదలై నా ఇం కా ఇయ్యలే. ప్రభు త్వం ఒక ఎకరానికే ఇచ్చి చేతులు దులుపుకుంటుందనే అనుమానం వస్తున్నది. రెండో విడుత రైతుభరోసా ఎప్పుడు ఇస్తారో చెప్తలేరు. వరి కోతలు ప్రారంభమైనా పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం ప్రభు త్వ వైఫల్యానికి నిదర్శనం. ప్రభు త్వం వెంటనే రైతుభరోసా నిధులు విడుదల చేయాలి.
– బుక రాజేందర్, రైతు, చీమన్‌పల్లి
రైతులను మోసం చేసిన కాంగ్రెస్
ఎన్నికల ముందర కాంగ్రెస్ పార్టీ రైతు లకు అనేక హామీలను ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేసింది. పంట రుణ మాఫీ ఎగ్గొట్టింది. రైతు భరోసా ఇవ్వకుండా ఆగం జేస్తుం ది. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభు త్వంలో కేసీఆర్ రైతులను కడుపున పెట్టు కొని కాపాడుకున్నారు. కాంగ్రెస్ మాయమాటలు చెప్పి రైతులను, ప్రజలను వంచించింది. రైతు భరో సా ఒక్క ఎకారానికే వేశారు. రెండు విడుత సంగతేందో ఎవరు చెప్త లేరు. గీ కాంగ్రెసోళ్లకు మాత్రం రైతులు, ప్రజలు గట్టిగానే బుద్ధి చెబుతారు.
-మచ్చర్ల భూషణ్‌రెడ్డి, రైతు, గడ్కోల్