రుద్రూర్, ఫిబ్రవరి 26 : ప్రతి నిరుపేదకూ డబుల్ బెడ్రూం ఇంటిని అందజేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. అక్బర్‌నగర్ వద్ద గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు స్పీకర్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. రుద్రూర్ గ్రామంలోని జేఎన్సీ కాలనీలో వంద డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌తోపాటు హౌసింగ్ ఏఈ నాగేశ్వర్రావుకు సూచించారు. గ్రామంలోని రాజరాజేశ్వరీ ఆలయం వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి, అంగడిబజార్ వద్ద కోటీ 30 లక్షల రూపాయలతో చేపట్టనున్న తహసీల్, ఎంపీడీవో కార్యాలయాల నిర్మాణానికి, ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో షాదీఖానతోపాటు రైతువేదిక వద్ద జనరల్ ఫంక్షన్ హాలును ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో ఓ వైపు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి పనులు కొనసాగితే.. మరోపక్క ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధే ఆ ప్రశ్న వేస్తున్న వారికి చెంపపెట్టు లాంటి సమాధానం అన్నారు. దేశంలో ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. రైతులు పంట మార్పిడిని అవలంబించాలని సూచించారు.
కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, జడ్పీటీసీ సభ్యుడు నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాతానాగేందర్, వైస్ ఎంపీపీ సాయిలు, సర్పంచ్ శేఖర్, ఉపసర్పంచ్ ఆసియా కౌసర్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ సంగయ్య, ఎంపీటీసీ సభ్యురాలు పత్తి సావిత్రి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగారాం, కార్యదర్శి బాలరాజు, విండో చైర్మన్ సంజీవ్‌రెడ్డి, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, తహసీల్దార్ ముజీబ్, కో-ఆప్షన్ సభ్యుడు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.