Collector Ila Tripathi | కంఠేశ్వర్, జూన్ 6 : ఎరువులు కొనే విషయంలో రైతులను ఎలాంటి ఒత్తిడికి గురిచేయొద్దని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఎరువుల దుకాణాలు, వివిధ సంస్థల ద్వారా యూరియా, ఇతర ఎరువులు కొనే రైతులకు వారి అంగీకారం లేకుండా వేరే ఏ రకమైన ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకూడదని సూచించారు.
యూరియా, ఎరువులు కొనుగోలు చేసేందుకు వచ్చే పలువురు రైతులకు నానో యూరియా కొనుగోలు చేయాలని కొంతమంది ఎరువుల దుకాణాదారులు, వివిధ సంస్థల వారు ఒత్తిడి చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇలా యూరియా ఎరువులతో ముడిపెడుతూ ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులను బలవంతం చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని హెచ్చరించారు. రైతులు కోరిన ఎరువులను మాత్రమే వారికి అందించాలని సూచించారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తూ రైతులను ఎవరైనా ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.