వినాయక్‌నగర్, జనవరి 12 : బ్యాంకుల్లో ఉన్న రుణాలను మాఫీ చేయిస్తానని నమ్మబలికి డాక్టర్ల నుంచి లక్షల రూపాయలు తీసుకొని పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు మోసగాడు తనకు రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని, పెద్ద పెద్ద వ్యక్తులు తెలుసని.. బ్యాంకుల్లో ఉన్న రుణాలను మాఫీ చేయిస్తానని డాక్టర్లను నమ్మించాడు. దీంతో డాక్టర్లు లక్షల రూపాయల్లో అప్పజెప్పారు. చివరికి మోసపోయామని గుర్తించిన వైద్యులు పోలీసులను ఆశ్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో ఉన్న బీరప్పనగర్, కేవీ రంగారెడ్డి కాలనీలో నివాసం ఉండే బంగారు అప్పారావు సింగరేణి వర్కర్. కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు.
నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని దేవీరోడ్డు ప్రాంతంలో ఉండే ఓ ప్రముఖ వైద్యుడికి బ్యాంకులో ఉన్న రూ. 50 లక్షల రుణాన్ని మాఫీ చేయిస్తానని నమ్మించాడు. సదరు డాక్టర్ నుంచి రూ.15 లక్షలు తీసుకొని, మోసం చేశాడు. ఇదేవిధంగా లోన్ సెటిల్మెంట్ చేస్తానని చెప్పి జగిత్యాల జిల్లా కోరుట్ల చెందిన డాక్డర్ వద్ద రూ. 60 లక్షలు, నిజామాబాద్ మోర్తాడ్‌కు చెందిన డాక్టర్ వద్ద రూ.12 లక్షలు తీసుకున్నాడు. ఇలా చాలా మంది దగ్గర బ్యాంకు రుణాలు మాఫీ చేయిస్తానని నమ్మించి వారి నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు దండుకున్నట్లు విచారణలో తేలిందని ఎస్‌హెచ్‌వో వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని దేవీరోడ్డుకు చెందిన డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి, పరారీలో ఉన్న నిందితుడు బంగారు అప్పారావును ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో వసూలు చేసిన డబ్బులను సదరు నిందితుడు రియల్ఎస్టేట్స్లో, ,ఇతరులకు అప్పులు ఇవ్వడంతోపాటు కొన్ని ప్లాట్లను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.