వర్ని, అక్టోబర్ 2: తాము చెప్పిందే చేస్తామని, చేసిందే చెప్తామని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికీ ఇల్లు ఉండాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. వర్ని మండల కేంద్రంలోని ఎస్.ఎన్ పురంలో పలు అభివృద్ధి పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. రూ.33కోట్లతో డబుల్ బెడ్రూం ఇండ్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, ప్రహరీ, అంగన్వాడీ భవనాలు, ప్రభుత్వ దవాఖాన భవనం, మహిళా మండలి భవనాలను స్పీకర్ పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యంకాని హామీలతో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బస్సులో డీజిల్ పోయలేకపోతున్నదని విమర్శించారు. ఉచిత విద్యుత్ అని చెప్పి నాలుగు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నదన్నారు.
ప్రస్తుతం ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో తెలంగాణలోనూ ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నదన్నారు. కాంగ్రెస్ హయాంలో 24వేల ఇందిరమ్మ ఇండ్ల పేరిట అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. నియోజకవర్గంలో 11వేల ఇండ్లు మంజూరు చేశామని, అందులో 4వేల ఇండ్లను తామే నిర్మించి ఇచ్చామని, మిగతా7వేల ఇండ్లను సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు వివరించారు. వర్ని మండల కేంద్రంలో గృహలక్ష్మి పథకానికి 78 దరఖాస్తులు అందాయని, వాటిని త్వరలోనే మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 120 కామన్ ఫంక్షన్ హాళ్లను నిర్మించి నిరుపేదలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, వర్ని జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, మండల కో ఆప్షన్ సభ్యుడు కరీం, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, బీఆర్ఎస్ నాయకులు కల్లాలి గిరి, వెలగపూడి గోపాల్, సహకార సంఘం అధ్యక్షుడు నామాల సాయిబాబా, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.
స్పీకర్ చేసిన అభివృద్ధిపై విద్యార్థినుల బుర్రకథ
వర్ని మండల కేంద్రంలో రూ.1.10కోట్లతో నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినులు రచన, సింధు, అక్షిత.. స్పీకర్ చేసిన అభివృద్ధి పనులపై బుర్రకథ ప్రదర్శించారు. విద్యార్థినుల ప్రదర్శనకు ముగ్ధుడైన స్పీకర్ వారికి రూ.10వేల నగదు పారితోషికాన్ని అందజేశారు. హెచ్ఎం సాయిలు, బోధనా సిబ్బందిని స్పీకర్ అభినందించారు.