Pitlam | పిట్లం, జూలై 13 : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిట్లం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, యువతకు ఆల్బెండాజోల్ మాత్రలను సోమవారం పంపిణీ చేశారు. పిల్లలను నులిపురుగుల బారినుంచి కాపాడి, వారి ఆరోగ్యం, పోషకాహారం, ఎదుగుదలకు తోడ్పడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు.
హాజరుకాని లేదా మాత్ర తీసుకోలేకపోయిన అర్హులైన పిల్లలు సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా ఆల్బెండాజోల్ మాత్రను పొందవచ్చని సూచించారు. పిట్లం మండలంలోని ప్రతీ అర్హత గల చిన్నారికి తప్పనిసరిగా మాత్ర అందేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని వైద్యాధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.