రుద్రూర్, నవంబర్ 27 : మండల కేంద్రంలో ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో దివ్యాంగులు తహసీల్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 6 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ మీరాబాయికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 6 వేలు పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో దివ్యాంగులకు 5 శాతం కేటాయించడంతోపాటు అర్హులందరికీ రేషన్‌కార్డులు అందజేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరచి, కాలయాపన చేస్తూ దివ్యాంగులను మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నవంబర్ 30న బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన, డిసెంబర్ 9న హైదరాబాద్‌లో దివ్యాంగులతో సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా ప్రధానకార్యదర్శి ఏశాల గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు నజీర్, ఆరిఫ్, సాయిలు, శంకర్, సుభద్ర, నీలమణి, జగ్గు శంకర్ తదితరులు పాల్గొన్నారు.