జూన్ 29న కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో యూరియా కొనుగోలు విషయంలో జరిగిన ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. యూరియా బుకింగ్ యాప్‌లో బస్తాలు బుక్ చేసుకున్న రైతులకు ఠంచనుగా అందివ్వాల్సిన బస్తాలు జాడ లేకపోవడం గందరగోళానికి దారి తీసింది. పలువురు రైతుల పేరిట నమోదైన యూరియా సంచులను అమ్మకందారులు ఇతరులకు కట్టబెట్టడంతో అయోమయం ఏర్పడింది. తమ సంచులను అక్రమంగా అమ్మేసుకున్నారంటూ రైతులు గగ్గోలు పెట్టాల్సినంత పరిస్థితి ఏర్పడింది. రంగంలోకి దిగి వ్యవసాయాధికారులు విచారణ చేసి లోపాన్ని గుర్తించి షాప్ యజమానిని హెచ్చరించారు.
జూన్ 8న కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడిలో యూరియా విక్రయంలో తీవ్ర ఆటంకం ఎదురైంది. సొసైటీ వద్ద రైతులు ఆందోళన చేయాల్సి వచ్చింది. జూన్ 7న 160 మెట్రిక్ టన్నులు సామర్థ్యం ఉన్న 3,552 బస్తాలు యూరియా పద్మాజివాడికి రావడంతో బుకింగ్ కోసం అందుబాటులో పెట్టారు. 15 నిమిషాల్లోనే మొత్తం నిల్వలు బుక్ చేయబడ్డాయి. తెల్లారి పంపిణీకి శ్రీకారం చుట్టగా ఉదయం 10గంటల తర్వాత బుకింగ్ ఐడీ నిర్ధారణ విషయంలో యాప్‌లోని అప్లికేషన్ సతాయించింది. దీంతో యూరియా పంపిణీలో జాప్యం ఏర్పడి రైతులు రోడ్డు ఎక్కాల్సినంత దుస్థితి ఎదురైంది.
జూన్ 20న రామారెడ్డి మండలంలోని పోసానిపేట, రామారెడ్డి, ఉప్పల్వాయి పీఏసీఎస్‌లకు 20 మెట్రిక్ టన్నులు యూరియా వచ్చింది. నిర్ణీత సమయంలో ఎరువుల బుకింగ్ యాప్‌లో నిల్వలు ప్రతిబింబించలేదు. సాంకేతిక కారణాలు వెలుగు చూడడంతో రైతులు గగ్గోలు పెట్టారు. వ్యవసాయాధికారులు రంగంలోకి దిగినప్పటికీ సాయంత్రం 6గంటల వరకు సాంకేతిక సమస్య పరిష్కారం కాలేదు.
నిజామాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం కొనుగోళ్లలో చేతివాటం ప్రదర్శిస్తూ రూ.లక్షలు కొల్లగొడుతోన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు యూరియా యాప్ కూడా కాసులు కురిపిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా అక్రమాలకు పాల్పడుతుండగా… మరికొంత కొంత మంది బహిరంగంగానే దొరికి పోతున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బస్తాలను తారుమారు చేయడం, యూరియా పంపిణీలో తరచూ సాంకేతిక కారణాలను బూచీగా చూపడం వంటివి వెలుగు చూస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం మాచారెడ్డిలో జరిగిన ఘటనలోనూ సొసైటీ సిబ్బంది పాత్ర తేలింది.
ఈ ఘటనలో యూరియా బుక్ చేసుకున్న రైతులకు బదులుగా ఇతరలకు బస్తాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. విచారణ చేసి తప్పును గుర్తించిన అధికారులు… వెంటనే సొసైటీ సిబ్బందిని సస్పెండ్ చేయడంతో పాటుగా పోలీస్ కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అష్టకష్టాలు తప్పడం లేదు. యూరియా బస్తాలను కొనుగోలు చేసేందుకు నరకం అనుభవించాల్సి వస్తోంది. సాగును వదిలి సొసైటీలు వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా ఎరువుల యాప్ వచ్చినప్పటి నుంచి కామారెడ్డి జిల్లాలో విపరీతమైన అవస్థ ఎదురవుతోంది.
రైతులకు ప్రతి సీజన్లోనూ తిప్పలు తప్పడం లేదు. యాప్ వినియోగంలో రైతులకు అవగాహన లోపం అంటూ ప్రభుత్వం, వ్యవసాయాధికారులు కొట్టి పారేస్తుండగా అంతకు మించి సాంకేతిక సమస్య తీవ్రంగా వేధిస్తోంది. యాప్‌లో ఎదురవుతోన్న సాంకేతిక సమస్యల వల్ల రైతులకు తలపోటు తెస్తోంది. బుక్ చేసుకున్న బస్తాలు సకాలంలో చేతికి రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ వానకాలం సీజన్లో కామారెడ్డి జిల్లాలో 50వేల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉన్నట్లుగా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జూలై 1వ తారీఖు నాటికి 19వేల మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ చేశారు. ప్రస్తుతం 6వేల మెట్రిక్ టన్నులు యూరియా నిల్వలు ఉన్నాయి. అయినప్పటికీ అనేక చోట్ల రైతులు రోడ్డు ఎక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి తప్పడం లేదు.
కర్షకులకు కన్నీళ్లు
వానకాలంలో ఆశించిన స్థాయిలో వానలు లేకపోవడంతో రైతులకు కన్నీళ్లు తప్పడం లేదు. దీనికి తోడగా సాగుకు నడుం బిగించిన రైతుకు యూరియా రూపంలో మరో ఇబ్బంది తీవ్రంగా కలిచి వేస్తోంది. సమయానికి యూరియా అందకపోవడంతో చితికి పోతున్నారు. వ్యవసాయాధికారులు చెబుతున్న ప్రకటనలకు క్షేత్ర స్థాయిలో వెలుగు చూస్తోన్న ఘటనలకు పొంతనే ఉండటం లేదు. రైతులు రోడ్డు ఎక్కి ఆందోళనలు చేస్తే యంత్రాంగం తక్షణం వాలి పోతోంది. సమస్య పరిష్కరిస్తామంటూ అధికారులు హామీ ఇస్తున్నారు.
ఆ తర్వాత సమస్యే లేదంటూ ప్రకటనలు, ఖండనలు జారీ చేస్తున్నారు. సాంకేతిక సమస్యలతో రైతులకు అనేక రకాల ఇబ్బందులు వస్తున్నప్పటికీ స్థానిక ఏవో, ఏఈవోలు సరిగా స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే కర్షకులు చేసేది లేక రోడ్డు ఎక్కి ఆందోళనలు చేయాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలంతా యూరియా యాప్ వినియోగం భేష్ అంటూ చెప్పుకుంటున్నారు. రైతులంతా మూకుమ్మడిగా ఈ యాప్ తీరునే దుయ్యబడుతున్నారు. అయినప్పటికీ వారి మాటల తీరులో మార్పు కానరావడం లేదు. రైతుల ఆందోళనలను కించపరిచే విధంగా కాంగ్రెస్ పాలకుల మాటలు ఉంటున్నాయని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు యూరియా సంచుల కోసం అవస్థలు పడలేదని… రేవంత్ రెడ్డి సర్కారులో ఈ దుస్థితి ఏమిటి? అంటూ రైతులు అడుగుతున్నారు.
మాచారెడ్డి ఘటనలో కేసు నమోదు చేస్తున్నాం…
మాచారెడ్డిలో యూరియా బస్తాలను యాప్‌లో బుక్ చేసుకున్న రైతులకు కాకుండా ఇతరులకు పంపిణీ చేసిన ఘటనలో పోలీస్ కేసు నమోదు చేయబోతున్నాం. తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదు. ఉద్దేశపూర్వకంగా యూరియా బస్తాలను అక్రమంగా తరలిస్తే, నిల్వ చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం. రైతులకు యూరియా కొరత లేకుండా జాగ్రత్తగా పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నాం. వానకాలం సీజన్ ప్రారంభమైన మొదట్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఇప్పుడు అలాంటిదేమీ లేదు.
– మోహన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి
యాప్‌ను తక్షణమే రద్దు చేయాలి
నాకు ఎనిమిది ఎకరాల్లో పంట సాగుచేశాను. యాప్‌తో పంటకు సరిపడా యూరియా దొరకలేదు. దీంతో నేను తీవ్ర ఇబ్బందులు పడ్డాను. ఉదయం 5 గంటలకు లేచి బుక్ చేసినా బుక్ అవ్వలేదు. రెప్పపాటులో మొత్తం యూరియా అయిపోయినట్లు చూపించింది. ప్రభుత్వం తక్షణమే యూరియా యాప్‌ను రద్దు చేయాలి.
-బానూరి నర్సారెడ్డి, రైతు, రామారెడ్డి
మాకు చదువురాదు ఎలా బుక్చేసుకోవాలి?
నాకు దాదాపు రెండున్నర ఎకరాల పొలం ఉన్నది. యాప్‌లో పలుమార్లు యూరియా స్టాక్ ఉన్నదని చూపించినా కొన్ని సమయాల్లో బుక్‌కాలేదు.మాకు చదువు అంతగా రాదు ..మేము ఎలా బుక్ చేసుకోవాలి. రైతు రాజ్యమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నది. యాప్ రద్దు చేసి సకాలంలో రైతులకు యూరియా అందేలా చూడాలి.
-రెడ్డి మల్లేశ్, రైతు గొల్లపల్లి, రామారెడ్డి మండలం