కామారెడ్డి, డిసెంబర్ 4 : తమకు ఫిక్స్డ్ వేతనం రూ.18వేలతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆశ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ హామీ మేరకు తాము చేపట్టిన సమ్మెను అక్టోబర్ 9న విరమించినట్లు తెలిపారు.
కానీ ఇచ్చిన హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలని, ప్రతి ఆదివారం, పండుగలకు సెలవు ఇవ్వాలని, ప్రతి ఏడాది 20 రోజుల వేతనంతోకూడిన క్యాజువల్ లీవులు మంజూరుచేయాలని కోరారు. ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు కూడా ఇవ్వాలన్నారు. 2021 జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల పీఆర్సీ బకాయిలను వెంటనే ఇవ్వాలని కోరారు.
అనంతరం అదనపు కలెక్టర్ విక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యురాలు రాజనర్సు, ఆశ వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు ఇంద్ర, ప్రధాన కార్యదర్శి రాజశ్రీ నాయకులు గంగామణి, నశ్రీం, కామేశ్వరి, మమత, పద్మ, శశికళ, కవిత, భాగ్యలక్ష్మి, అనిత, సావిత్రి, సుజాత, విజయ, మంజుల, స్వరూప తదితరులు పాల్గొన్నారు.