నిజామాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసున్నామన్న ప్రభుత్వ ప్రకటనతో రైతాంగం సంబురపడింది. అయితే, రుణ విముక్తి లభించిందని సంబురపడిన అన్నదాతలకు ఊహించని షాక్ తగిలింది. జాబితాలో పేర్లు లేకపోవడం, రుణ ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో అవాక్కవడం రైతుల వంతవుతున్నది. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ ప్రక్రియ అంతా అయోమయం.. గందరగోళంగా మారింది. లోన్ ఎందుకు మాఫీ కాలేదో అర్థం కాక రైతాంగం ఆందోళన చెందుతున్నది. అన్నదాత గోడు వినే వారు లేరు. గోస తీర్చే వారూ లేరు. పనులు మానుకుని బ్యాంకులు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో ఆగ్రహానికి గురవుతున్న కర్షకులు ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా రెంజల్‌లోని కెనరా బ్యాంక్ ఎదుట ధర్నా చేపట్టారు.
అధికారుల అలసత్వం, బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణం గా వేలాది మంది రైతులకు రుణ మాఫీ కాలేదు. అ ర్హులైన అన్నదాతలకు మాఫీ కాకపోవడం వెనుక జా బితాల రూపకల్పనలో తీవ్ర నిర్లక్ష్యం జరిగినట్లు రై తులు మండిపడుతున్నారు. మరోవైపు, రేషన్ కార్డు నిబంధన మూలంగా చాలా మందికి అన్యాయం జరిగిన ట్లు తెలిసింది. ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి వేరుగా జీవనం సాగిస్తున్న వారికి మాఫీ కాలేదు. కుటుంబంలోని అందరికీ రుణమాఫీ పొందేందుకు అర్హత ఉన్నా ఒకరి పేరిట ఉన్న లోన్‌ను మాత్రమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడంతో మిగతా వారికి అన్యాయం జరిగింది.
నిజామాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 44,46 9 మంది రైతు కుటుంబాలకు సంబంధించి, రూ. 225 కోట్లు, రెండో విడుతలో 22,868 మందికి సంబంధించి రూ.210 కోట్ల రుణాలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసింది. తొలి విడుతలో 517 ఫిర్యాదులు రాగా పరిష్కరించారు. రెండో విడుత వచ్చేసరికి సహాయక కేంద్రాలు నామమాత్రంగానే మారాయి. రైతులు ఫోన్ చేస్తుంటే పెద్దగా స్పందన ఉండడం లేదు. పదుల సార్లు ఫోన్లు చేసినా లైన్ కలవడం లేదంటూ నిట్టూరుస్తున్నారు.
రుణమాఫీ పథకంలో లబ్ధి పొందిన వారి కన్నా పొందని వారే ఎక్కువగా ఉన్నారు. రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న సన్న చిన్నకారు రైతులకు ప్రయోజనం దక్కలేదని తెలిసింది. కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణించడం ద్వారా చాలా మంది అవకాశాన్ని కోల్పోయారు. గతంలో కేసీఆర్ సర్కారు ఉన్నప్పు డు రుణాల మాఫీలో ఇంతటి గందరగోళం లేదు. కేసీఆర్ హయాంలో చేపట్టిన రుణమాఫీ సమయంలోనూ ఇదే యంత్రాంగం పని చేసింది. ఇప్పుడున్న కలెక్టర్‌తో పాటు వ్యవసాయ శాఖ అధికారులంతా వారే ఉన్నారు. కానీ ప్రభుత్వ కొర్రీల కారణంగా గందరగోళం ఏర్పడింది.మార్గదర్శకాల పేరు తో ఆంక్షలు పెట్టి మరీ చాలా మంది అర్హులైన రైతులను రుణమాఫీ వర్తించకుండా చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కెనరా బ్యాంకు నుంచి 2022 లో లక్ష రూపాయల క్రాప్ లోన్ తీసుకున్న. సకాలంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం లోన్‌ను రెన్యువల్ కూడా చేయించుకున్న . కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండో విడుత రుణమాఫీ జాబితాలో నాపేరు లేదు. నాకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీ లిస్టులో నా పేరులేదు. దీనిపై అధికారులకు అడిగితే సరైన సమాచారం ఇస్తలేరు. బ్యాంకు అధికారుల తప్పిదంతోనే నాకు రుణమాఫీ కాలేదని తెలుస్తున్నది.
-మద్దిపొటి ఉదయ్ భాస్కర్‌రావు, రైతు, దండిగుట్ట
పోయిన ఏడాది బ్యాంకులో లక్షా పదివేల రూపాయల పంట రుణం తీసుకున్న. లోన్ తీసుకున్న రైతుల లిస్టును అధికారులు పట్టించుకోలే. సకాలంలో రెన్యువల్ కూడా చేయకపోవడం, ప్రామాణికంగా జాబితాను ప్రభుత్వానికి పంపకపోవడంతో రుణ మాఫీ కాలేదు. ఈ బ్యాంకుల ఖాతా తీసుకోవడంతోనే రుణమాఫీ వర్తించలేదేమో అనిపిస్తున్నది. గవర్నమెంట్ చెప్పేదొకటి..చేసేది మరొకటిలా ఉంది. రుణమాఫీపై కచ్చితమైన క్లారిటీ ఇచ్చేవారే కరువయ్యారు.
-గౌతమ్ కృష్ణారావు, రైతు, దండిగుట్ట
గీ సర్కారు రుణమాఫీ చేసిందని వారం రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్న. కొందరేమో వ్యవసాయాధికారులకు వెళ్లి అడగండి అని చెబితే వాళ్ల దగ్గరికి పోయి కూడా అడిగినా. నాకు రుణమాఫీ అయ్యింది.. కాలేదని ఎవరూ కచ్చితంగా చెప్పుతలేరు. గవర్నమెంటేమో అందరికీ రుణమాఫీ చేసినట్లు చెబుతున్నది. కానీ మాకు మాత్రం నిరాశే మిగిలేలా కనిపిస్తున్నది.
-ఖేతావత్ మధుబాయి, దండిగుట్ట