లింగంపేట, జూన్ 14: పంట రుణాల వసూళ్లలో కర్కశంగా వ్యవహరిస్తున్న సహకార కేంద్ర బ్యాంకు అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలంలోని పొల్కంపేట గ్రామానికి చెందిన రైతు రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయ భూమిలో బ్యాంకు అధికారులు ఎర్ర జెండాలను పాతడంపై మండిపడ్డారు. ఈ మేరకు వారు లింగంపేట సహకారం కేంద్ర బ్యాంకు ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. పంట రుణాల వసూలులో బ్యాంకు అధికారులు వ్యవహరించిన తీరును ఎండగట్టారు. ధర్నాలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు రైతుల పక్షాన నిలవాల్సింది పోయి .. వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. సహకార బ్యాంకు అధికారులు రైతుల పంటపొలాల్లోకి వెళ్లి ఎర్ర జెండాలు పాతి భయభ్రాంతులకు గురిచేయడం దారుణమని పేర్కొన్నారు. ఇలా రైతుల పంట పొలాల్లో ఎర్ర జెండాలు పాతడం చరిత్రలో మొదటి సారి అని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయాన్ని పండుగలా మార్చినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. గతేడాది డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇంతవరకూ అమలుచేయకుండా రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. పొల్కంపేట గ్రామానికి చెందిన రైతు రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయ భూమిలో బ్యాంకు అధికారులు ఎర్ర జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రైతు పరువు తీయడం సరికాదన్నారు. పాతిన ఎర్ర జెండాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇచ్చిన మాట తప్పిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే రుణమాఫీ చేయడంతో పాటు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, నాయకులు నీరడి సంగమేశ్వర్, సాయిలు, గంగారాం, గన్ను నాయక్, నరేశ్, వెంకటేశం, రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మణ్, సాయికిరణ్, సిద్దిరాములు, మహిపాల్‌రెడ్డి, ఆయా గ్రామాలకు చెందిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.