కంటేశ్వర్ : గ్రామ పంచాయతీ వర్కర్ల (GP Workers) పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్ వేతనాలు ( Wages ) నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికులకు ప్రతి నెలా వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
డిసెంబర్ నుంచి నేరుగా వర్కర్ల అకౌంట్లో వేతనాలు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పీఎఫ్(PF), ఈఎస్ఐ(ESI) , గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ ను అమలు చేయాలని, జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ జీవో 51 రద్దు చేయాలని, గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.