నిజామాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గత ప్రభుత్వంలో సవ్యంగా జరిగిన ధరణి వ్యవస్థలో ఇప్పుడు అడుగడుగునా నిర్లక్ష్యం తాండవిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల్లో నెమ్మదించిన ప్రక్రియతో పట్టాదారులకు అంతులేని బాధను మిగిలిస్తున్నది. మొన్నటి వరకు క్రమపద్ధతిలో జరిగిన ధరణి రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఎందుకు అలసత్వం అంటుకున్నదో ఎవ్వరికీ అర్థం కావడంలేదు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను ధరణి సమస్యలపై రైతులు ప్రశ్నిస్తే తమ వద్ద ఏమీ లేదంటూ చేతులు ఎత్తేస్తున్నారు.
కలెక్టరేట్‌కు వెళ్లి వివరాలు ఆరా తీస్తే ఇక్కడేం ఉండదని జవాబుదాటవేస్తున్నారు. మండలాఫీసుకు వెళ్లండంటూ తిరిగి పంపిస్తున్నారు. లేదంటే హైదరాబాద్‌లోని సీసీఎల్ఏను సంప్రదించాలంటూ హితవు పలుకుతున్నారు. వెరసి ధరణి మూలంగా ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలతో రైతులకు అగచాట్లు తప్పడం లేదు. నిమిషాల్లో జరిగిన భూ బదలాయింపు నుంచి రోజుల వ్యవధిలోనే ఇంటికి చేరిన పట్టాదారు పాస్‌బుక్ దాకా కేసీఆర్ పరిపాలనలో ఇక్కట్లు అన్నవే మచ్చుకు కనిపించలేదు. ఇప్పుడు తీవ్రమైన జాప్యం జరుగుతున్నది.
గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వచ్చాక పైరవీ అనే పదం కనిపించలేదు, వినిపించలేదు. భూ బదలాయింపు ప్రక్రియ గతంలో ఆలస్యమయ్యేది. ఆ సమస్య పూర్తిగా లేకుండా పోయింది. నిమిషాల్లోనే పనులు అయ్యేలా ధరణిని కేసీఆర్ సర్కారు రూపొందించి అమలు చేసింది. గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్దకు వెళ్లి చాలా సేపు ఎదురు చూసే పరిస్థితికి చెక్‌పెడుతూ వ్యవస్థలో పెను మార్పు తెచ్చింది. ధరణితో రైతుల వ్యవసాయ భూములకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతోపాటు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికి 10 నుంచి 15 నిమిషాల్లో పట్టా చేతికిచ్చి పంపేది. రైతులకు సులభంగా రిజిస్ట్రేషన్ పట్టాలు అందించాలనే ప్రభుత్వం ఒక సంకల్పంగా నెరవేర్చింది.

గడిచిన ఐదారు నెలల్లో ధరణిలో రిజిస్ట్రేషన్లకు తంటాలు పడాల్సి వస్తున్నది. గంటల సేపు వేచి చూస్తే కానీ రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు. సర్వర్ ప్రాబ్లమ్స్, అధికారుల సమయపాలన లోపంతో ఇదంతా జరుగుతున్నది. కలెక్టర్, అదనపు కలెక్టర్ల పర్యవేక్షణ లోపం కూడా తహసీల్దార్లకు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఉంది. ఎంపీ ఎన్నికల పేరిట తహసీల్ కార్యాలయాల్లో కుప్పలు తెప్పలుగా ధరణి స్లాట్లు పెండింగ్‌లో ఉండడమే ఇందుకు కారణం. ఏప్రిల్ నెలలో అక్కడక్కడా జరిగిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాస్‌బుక్కులు చేతికి రాకపోవడం విడ్డూరంగా మారింది. పీపీబీ కోసం తహసీల్ కార్యాలయాల్లో వాకబు చేస్తే సీసీఎల్ఏ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. సరైన జవాబే ఇవ్వడం లేదు.
నందిపేట్, జూన్ 13: దళారులను కాదని బయట స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ కోసం తహసీల్ కార్యాలయానికి వెళ్లే దరఖాస్తుదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దళారుల మధ్యవర్తిత్వంతో వచ్చే దరఖాస్తుల్లో పత్రాలు సరిపడా లేకున్నా పని సులువుగా అవుతుందని, బయట మీసేవా సెంటర్లలో స్లాట్‌బుక్ చేసుకొని వెళ్తే మాత్రం లేని తప్పులు వెతికి పట్టుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఆర్మూర్ ప్రాంతాల్లోని కొన్ని తహసీల్ కార్యాలయాల్లో కేవలం ఆపరేటర్ల ద్వారానే అంతా జరుగుతున్నట్లు సమాచారం.
దీంతో ఆపరేటర్లు పెట్టే కొర్రీలకు తలనొప్పులు ఎందుకని భావించి రైతులు దళారులను ఆశ్రయించి వారి ద్వారా స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ చార్జీలతోపాటు ఎకరానికి ఇంతా అంటూ ముట్టజెప్పే పరిస్థితులు వచ్చినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆలూర్ తహసీల్ కార్యాలయంలో ఇలాంటి సంఘటనే ఎదురైతే రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దళారుల ద్వారా స్లాట్ బుక్ చేసుకునే వారి డాక్యుమెంట్లను సైతం చూపించకుండా నేరుగా రిజిస్ట్రేషన్‌కు వచ్చేయండంటూ ఆపరేటర్లు చెబుతుండడం, క్రయవిక్రయ డాక్యుమెంట్లో పేర్లు, వివరాలు సరిగ్గా ఉన్నాయా లేవా అనేది తెలియకుండానే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నట్లు సమాచారం.
తహసీల్ కార్యాలయాల్లో ఇప్పుడం తా కొత్త వారు పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందట జరిగిన బదిలీల్లో ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారంతా వచ్చి నిజామాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ పని చేసిన వారంతా వేరే చోటికి బదిలీ అయ్యారు. ఎన్నటికైనా బదిలీ తప్పదనే భావనతో ఇప్పుడున్న వారిలో ఎక్కువ మంది పనిపై అంతగా శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్‌గా జరిగే ప్రక్రియను సైతం లెక్కచేయకుండా గాలికి వదిలేసి నిర్లక్ష్యం వహిస్తున్నట్లుగా అర్థమవుతున్నది. ఎలాగూ బదిలీ అనివార్యమైన వేళ ఇదంతా నెత్తిన వేసుకోవడం దేనికి? అన్నట్లుగా చాలా మంది భావిస్తున్నారు. దీంతో రెవెన్యూ శాఖలో అంతులేని నిర్లక్ష్యం..
ప్రభావం కాస్తా రైతులపై పడుతున్నది. మొక్కుబడిగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను చేసి చేతులు దులుపుకొంటున్నారు. మిగిలిన పనులను చక్కబెట్టడం లేదు. కొంత మంది కేవలం వివాదాస్పద భూములనే టార్గెట్ చేస్తున్నట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొన్నటి వరకు సివిల్ సైప్లెస్లో డీటీలుగా పని చేసి తహసీల్ కార్యాలయాల్లోకి వచ్చిన వారంతా విధులకు డుమ్మా కొడుతున్నారు. తిరిగి అదే శాఖకు వెళ్లేందుకు పైరవీలు చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖలో ఆమ్యామ్యాలకు అలవాటు పడిన డీటీలు తిరిగి వస్తామంటూ రైస్‌మిల్లర్లకు, దో నంబర్ దందాపరులకు ఫోన్లు చేస్తూ మేనేజ్ చేస్తున్నట్లుగానూ ఆరోపణలు వినిపిస్తున్నాయి