కట్టంగూర్, ఆగస్టు 29: బీఆర్ఎస్ ప్రభుత్వంలో నకిరేకల్ నియోజకవర్గానికి మంజూరైన రూ.150కోట్ల నిధులను రాజకీయాలకు అతీతంగా ఖర్చు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో అభివృద్ధి పనులకు మంజూరైన నిధులను ఆ పనులకే ఖర్చు చేయాలన్నారు. కేసీఆర్ పంచాయతీలకు అందజేసిన ట్రాక్టర్లు వినియోగంలో లేకుండాపోవడంతో గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని ప్రతి సందర్భంలో ప్రజలు గుర్తు చేసుకునే వారని, నేడు రెండు ఏండ్లలో రాష్ట్రంలో సీఎం ఉన్నాడా లేడా అనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతుందన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీలో అమృత పథకం కింద రూ.5 కోట్లు మం జూరు చేయించానని, ఆ పనులు ఇప్పటికీ మొదలు కాలేదన్నారు.
వర్షాలు వచ్చినప్పుడు కేసీఆర్ అధికారులను ఎప్పకప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ శ్రేణులను భాగస్వాములను చేసి సహాయక చర్యలు చేపట్టే వారని తెలిపారు. వారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సహాయ చర్యలు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం కాదు కూళేశ్వరం అంటూ సీఎం కుంటి సాకులు చెబుతూ చంద్రబాబు కన్నుసన్నల్లో రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు. నియోజకవర్గంలో రోడ్లు గుంతలు పడి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి పట్టింపులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇవ్వడంతో మీ మీద నమ్మకం పెట్టుకొని ఓట్లు వేశారని, ఈ రెండేండ్లలో మీరు గ్రామాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలని ఎమ్మెల్యే వీరేశానికి విజ్ఞప్తి చేశారు. కట్టంగూర్ పెద్దవాగుపై వంతెన నిర్మాణాలకు బీఆర్ఎస్ హయాంలో రూ.4 కోట్లు మంజూరు చేయించానని, ఇంత వరకు పనులు మొదలుకాలేదన్నారు. ఎమ్మెల్యే, మంత్రులు, సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించి గతంలో చేసిన పనులకు పెండింగ్ బిల్లులు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యక్తులను గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చౌగోని జనార్దన్, బెల్లి సుధాకర్, గుండగోని రాములు, దాసరి సంజయ్‌కుమార్, నోముల వెంకటేశ్వర్లు, నలమాద సైదులు, మేడి రాములు. మునుగోటి ఉత్తరయ్య, జిల్లా యాదయ్య, పోగుల నర్సింహ్మ, పోగుల అంజయ్య, మాతంగి సైదులు, రాచకొండ యాదయ్య, యర్కల మల్లేశ్, అంతటి అంజయ్య పాల్గొన్నారు.