శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందువరుసలో ఉన్న నిజామాబాద్‌కు రాష్ట్రప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ను రెడీ చేసింది. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న బృహత్ ప్రణాళికకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. 2041 వరకు అమల్లో ఉండే ఈ మాస్టర్ ప్లాన్‌ను రాబోయే రెండు దశాబ్దాల అవసరాలకు తగినట్లుగా రూపొందించారు. నగర విస్తృతి, ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఖరారుచేసిన ఈ మాస్టర్‌ప్లాన్‌పై 15రోజులపాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం ముసాయిదాలో మార్పులు చేర్పులు చేసి తుది ప్లాన్‌ను ప్రకటించనున్నారు. కొత్త మాస్టర్‌ప్లాన్ నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు 73 గ్రామాలకు వర్తించనుంది. ఇందులో 120 ఫీట్ల ఇన్నర్ రోడ్డు, 200 ఫీట్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
– నిజామాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణాలు, నగరాల రూపురేఖలు మారిపోయాయి. గతంలో పురపాలక సంఘాలను పట్టించుకునే వారే కరువు. సీఎం కేసీఆర్ చొరవ, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో అనేక నగరాలకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం అవుతున్నాయి. గజిబిజి గందరగోళానికి చెక్ పెడుతూ భవిష్యత్తులో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చక్కని ప్రణాళికలను అందుబాటులోకి తెస్తున్నారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందు వరుసలో ఉన్న నిజామాబాద్‌కు మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న బృహత్ ప్రణాళికకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. 2041 సంవత్సరం వరకు అమలయ్యే మాస్టర్ ప్లాన్ కోసం వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 15 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి అవసరమైన చోట మాస్టర్ ప్లాన్‌లో మార్పులు, చేర్పులను చేయబోతున్నారు. నిజామాబాద్ బృహత్ ప్రణాళికలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు 73 గ్రామాలకు వర్తించనున్నది. ఇందులో 120 ఫీట్ల ఇన్నర్ రోడ్డు, 200 ఫీట్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన ప్రధాన ఆకర్షణగా నిలువబోతున్నది.
తెలంగాణ పట్టణాభివృద్ధి చట్టం 1975 లోని విభాగం 12(4) నియమావళి అనుసరించి మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ జారీ చేశారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) పరిధిలోని నిజామాబాద్ నగరపాలక సంస్థ, అనేక గ్రామాలను కలుపుకొని మాస్టర్ ప్లాన్‌ను అమృత్ స్కీమ్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, హైదరాబాద్ ద్వారా ఆమోదించబడింది. నిజామాబాద్ పట్టణ బృహత్ ప్రణాళిక విస్తీర్ణం గతంతో పోలిస్తే భారీగా విస్తరించింది. నిజామాబాద్ కార్పొరేషన్, చుట్టు పక్కల అనేక గ్రామాలను కలుపుకొని ప్రణాళిక రూపొందించింది.
ముఖ్యంగా నిజామాబాద్ మండలంలో 19 గ్రామాలు, డిచ్‌పల్లిలో 10 , మాక్లూర్‌లో 13, మోపాల్‌లో 11, నవీపేటలో 8, ఎడపల్లిలో 10, రెంజల్ మండలంలో దూపల్లి, వర్ని మండలంలో మౌలాయిపూర్ గ్రామాలున్నాయి. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న జనావాసాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. మాస్టర్ ప్లాన్‌ను హైదరాబాద్‌కు చెందిన ఆర్.వి. కన్సల్టెన్సీ సంస్థ నిర్వహించింది.
నిజామాబాద్ నగరం పరిధిలో ఇప్పటికే మాస్టర్ ప్లాన్ పూర్తయింది. నిజామాబాద్ దాటి నుడా పరిధిలోని గ్రామాలకు ఇప్పుడు మార్పులు, చేర్పులకు అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. నిజామాబాద్ పట్టణంలో 1974 తర్వాత 20 సంవత్సరాలకోసారి జరిగే మాస్టర్ ప్లాన్ జరగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ తయారు చేయించాం. పట్టణ పరిధితో పాటు చుట్టు పక్కల విలీన గ్రామాలు కలుపుకొని డ్రాఫ్ట్ ఎప్పుడో సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయం సేకరించాం. దాని తర్వాత నుడా పరిధిలోని గ్రామాలను తీసుకుని ఆ గ్రామాలను కూడా నుడా ప్లాన్‌లో పెట్టాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. మళ్లీ ఆ ప్రాంతాన్ని ఈ మాస్టర్ ప్లాన్‌కు జోడించారు. త్వరలోనే నుడా ఏరియాను కలుపుకొని మాస్టర్ ప్లాన్ ప్రజలకు అందుబాటులోకి రానున్నది.
– బిగాల గణేశ్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బృహత్ ప్రణాళిక తుది రూపునకు చేరింది. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ సహకారంతో మాస్టర్ ప్లాన్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దాం. నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయిన నేపథ్యంలో 15 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తాం.
– ప్రభాకర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆనుకున్న ఉన్న గ్రామాలతో పాటు మిగిలిన పంచాయతీలను నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) పరిధిలోకి వచ్చాయి. ఇది నగర పాలక సంస్థకు బయట 5 కిలో మీటర్ల రేడియల్ విస్తీర్ణంతో 568.32 చదరపు కిలో మీటర్ల పరిధి తీసుకున్నారు. ఆర్మూర్ రోడ్డులోని ఇంజినీరింగ్ కళాశాల, అమ్రాద్, న్యాల్కల్ తదితర గ్రామాలను కలుపుతూ 200 ఫీట్లతో రింగ్ రోడ్డునూ ప్రతిపాదించారు. ఇందులోనూ వివిధ జోన్లుగా విభజించి అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు ఉండనున్నాయి. ఇప్పటికే సర్వే పూర్తయిన నేపథ్యంలో నివేదికపై వివిధ ప్రభుత్వ శాఖలు పూర్తి స్థాయిలో చర్చించాయి. అభ్యంతరాల స్వీకరణ పిమ్మట ప్రభుత్వ ఆమోదం కోసం మాస్టర్ ప్లాన్‌ను పంపనున్నారు. నిజామాబాద్ పాత మున్సిపాలిటీ పరిధి 40 చదరపు కిలో మీటర్లు విస్తరించి ఉండేది. విలీన గ్రామాలు తొమ్మిదింటిని కలుపుకొని 98.34 చదరపు కిలో మీటర్లకు చేరింది. కొత్తగా ఆర్మూర్, వర్ని, బోధన్, హైదరాబాద్ రోడ్లను 120 ఫీట్లుగా ప్రతిపాదించారు. నగరంలోని 26 పెద్ద, 50 వరకు అంతర్గత రోడ్లను విస్తరించాలని నిర్ణయించారు. 2018 నుంచి నిజామాబాద్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలోనే ఈ ప్రాంతంలో 903 అభ్యంతరాలు స్వీకరించారు. నుడా పరిధికి బృహత్ ప్రణాళికను జోడించడంతో తాజా నోటిఫికేషన్ 2022, ఫిబ్రవరి 26న వెలువడింది. 15 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించబోతున్నారు.
నిజామాబాద్ బృహత్ ప్రణాళికలో భౌగోళిక విస్తీర్ణం 569.32 చదరపు కిలో మీటర్లు కలిగి ఉంది. ఇందులో నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలకు చెందిన 8 మండలాల పరిధి విస్తరించి ఉంది. మొత్తం 73 గ్రామాల్లో నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది. ఇందుకు అనుగుణంగానే మాస్టర్ ప్లాన్‌ను నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్‌లో హద్దులు వివరాలను నుడా అధికారికంగా విడుదల చేసింది. ఉత్తరం వైపు దరియాపూర్, నవీపేట, కమలాపూర్, పొతంగల్, జన్నేపల్లి, మెట్పల్లి, గొట్టిముక్కల, వెంకటాపూర్, కల్లెడ, గుత్ప గ్రామాలున్నాయి. దక్షిణం వైపు డిచ్పల్లి, ఘన్పూర్, దూస్‌గాం, చిన్నాపూర్, బాడ్సి, మంచిప్ప, కాల్పోల్, బాజిదాపూర్, ఫారెస్ట్ ఏరియా, చింతకుంట ఉన్నాయి. తూర్పు వైపు మిట్టాపల్లి, బీబీపూర్ తండా, సుద్దపల్లి, యానంపల్లి, పుప్పాలపల్లి, సికింద్రాపూర్, మాదాపూర్, మునిపల్లి ఉన్నాయి. పడమర దిక్కున మోస్రా, అమ్దాపూర్, ఇబ్రహీంపూర్, ఎరాజ్‌పల్లి, ఎడపల్లి, ఏఆర్పీ క్యాంపు, బ్రాహ్మణపల్లి, కళ్యాపూర్, రెంజల్ గ్రామాలను నిర్దేశించారు. నిజామాబాద్ మున్సిపాలిటీలో 1974లో ఆమోదించిన బృహత్ ప్రణాళికనే నేటి వరకు అమలైంది. నగర పాలక సంస్థగా మార్పు చెందాక జనాభా, ట్రాఫిక్ రద్దీ, నియంత్రణ, మౌలిక సదుపాయాల కల్పన అవసరమని భావించారు. 2041 నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాణిజ్య, పరిశ్రమలు, రెసిడెన్షియల్, రవాణా, రిక్రియేషన్ జోన్లను ప్రతిపాదిస్తూ ప్రణాళికలు సిద్ధం చేశారు.