వినాయక్‌నగర్, ఆగస్టు 6: గిరిజన రైతులను అటవీశాఖ అధికారులు వేధిస్తున్నారంటూ బంజారా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. మోపాల్ మండలం బైరాపూర్-కాల్పోల్ బీట్ పరిధిలో ప్రకాశ్ అనే రైతు రెండురోజుల క్రితం పంట సాగుచేస్తుండగా అటవీ అధికారులు అక్కడికి వెళ్లి పంటపై గడ్డి మందు పిచికారీ చేశారు. అధికారుల తీరుతో తీవ్ర మనస్థాపం చెందిన ప్రకాశ్ గడ్డి మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు.
ఇందుకు కారణమైన అటవీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో బైరాపూర్ గ్రామస్తులు అటవీ శాఖాధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామస్తులను కార్యాలయంలోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకోగా గ్రామస్తులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అటవీశాఖాధికారులకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు.
రైతు ప్రకాశ్ ఆత్మహత్యా యత్నానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సౌత్ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ రాధికకు వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వం పట్టాలు ఇవ్వడంతో గిరిజనులు సాగు చేసుకుంటున్న పంటలను నాశనం చేయం ఎక్కడి న్యాయమని నాయకులు ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామావ్ మోహన్ నాయక్, ఇతర బాధ్యులు కేతావత్ పీర్ సింగ్, గ్రామస్తులు పాల్గొన్నారు.