ఖలీల్‌వాడి, జూలై 8: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రూ.4వేల జీవనభృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ బీడీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, కార్మికులకు ఉపాధి కల్పించడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవనభృతి ఇచ్చి ఆదుకోవాలన్నారు. బీడీ పరిశ్రమను దెబ్బ తీసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రకరకాల చర్యలు చేపట్టిందని ఆరోపించారు. సిగరెట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేయడం సాధ్యం కాదని అసెంబ్లీలో తీర్మానం చేయించాలని సీఎంను కోరారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సూర్యశివాజీ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా అధ్యక్షుడు ఆకుల పాపయ్య, బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ భూమేశ్వర్, భూమన్న దాసు, యూనియన్ నాయకులు శివకుమార్, గంగాధర్, పద్మ, సుప్రియ, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.