వానకాలానికి సంబంధించి రైతుభరోసా ఇవ్వలేమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. జిల్లా కేంద్రాలతోపాటు ప్రతి మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు పెద్దసంఖ్యలో రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.
మాక్లూర్ మండలం మానిక్‌బండార్‌లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, తాడ్వాయిలో చేపట్టిన ధర్నాలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రైతుభరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంటలు కోతకు వచ్చినా .. రైతు భరోసా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలతో పాటు రైతుబంధు, రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాగిరెడ్డిపేటలో రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకొన్నారు. రోడ్డుపై నుంచి వారిని బలవంతంగా పక్కకు పంపించారు. దీంతో వారు ర్యాలీగా వెళ్లి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతు నిరసన దీక్ష చేపట్టారు.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 20
ఖలీల్‌వాడి, అక్టోబర్ 20 : సీఎం రేవంత్‌రెడ్డి రైతు పాలిట శాపంలా మారాడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. రైతుల నోటికాడ బుక్క లాక్కున్న రేవంత్‌కు పుట్టగతులు ఉండవన్నారు. రేవంత్ గుంపు మేస్త్రీతోపాటు గప్పాల మేస్త్రీ అయ్యాడని విమర్శించారు. మోసాల్లో మోనార్క్‌గా తయారయ్యాడన్నారు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడాన్ని కేసీఆర్ కనీస ధర్మంగా పాటించారని తెలిపారు. రూ. 80 వేల కోట్ల అప్పు తెచ్చిన రేవంత్.. రైతులకు ఏడు వేల కోట్ల పెట్టుబడి సాయం ఇవ్వలేవా ? అని ప్రశ్నించారు. మూసీ తప్ప ఈ సీఎంకు వేరే పని లేదని, కమీషన్లు రావనే రైతుబంధు ఆపారని అన్నారు. మాట తప్పిన రేవంత్‌ను మడత బెట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తానని బొంకి, ఇప్పుడు సన్న వడ్లకే అంటున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మ క్కలకు బోనస్ ఇస్తానని, దానిని కూడా ఎగ్గొటాడన్నారు. ఇక రైతు రణం చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఓట్లున్నప్పుడే రైతులు గుర్తుకొస్తారని, ఇక రేవంత్‌కు కౌంట్‌డౌన్ మొదలైందన్నారు. రైతులతో పెట్టుకున్నోడు ఎవడైనా మట్టి కరవాల్సిందే అన్నారు. ఢిల్లీకి ట్రిప్పులు.. ప్రజలకు తిప్పలు ఇదే రేవంత్ సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్‌కు రానున్న రోజుల్లో ప్రజ లే గుణపాఠం చెబుతారని అన్నారు. జడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సత్యప్రకాశ్, రవి, సిర్ప రాజు, అభిలాష్‌రెడ్డి పాల్గొన్నారు.
లింగంపేట(తాడ్వాయి), అక్టోబర్ 20: మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మండిపడ్డారు. ఆదివారం మండల కేంద్రం లో నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు వానకాలం పంట పెట్టుబడి సాయం అందకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతుబంధు పథకాన్ని నీరుగార్చడానికి ప్రయత్నాలు చేస్తోందన్నారు. రైతుభరోసాపై సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నదన్నారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి కమిటీలు లేకుండా రైతుబంధు డబ్బులు అందించినట్లు తెలిపారు. రైతులు కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ముందుకు పడ్డ దాఖలాలు లేవన్నారు. రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా మార్చిందని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయాన్ని దండగగా మారుస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11తనెలల కాలంలో అన్ని రంగా ల్లో విఫలమైందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తున్నారని అన్నారు. కామారెడ్డి జిల్లాలో పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన దాఖలాలు లేవన్నారు. రైతుభరోసా వచ్చే వరకూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని జాజాల స్పష్టం చేశారు.
-మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్