నిజామాబాద్, ఆగస్టు 4, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు గడ్డు కాలం ఎదురవుతోంది. ఏడాది పొడవునా ఏ కాలమైన కష్టాలు మాత్రం తప్పడం లేదు. యాసంగిలో అగచాట్లు పడుతూ సీజన్‌ను నెట్టుకొచ్చారు. సాగుకు నీటి వసతి లేక పంటలు ఎండిపోయి చాలా మంది అప్పుల పాలయ్యారు. కొద్ది మంది ఏకంగా అప్పులు చెల్లించలేక తనువు చాలించారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభు త్వం చలించలేదు. రైతులను ఆదుకోలేదు.
ఈ వానాకాలంలో వానలు మందగించాయి. జూన్ ప్రారంభంతో దంచికొట్టిన వర్షాలు ఇప్పుడేకంగా మొఖం చాటేశాయి. దీంతో వానల్లేక పంటలకు నీరు అందక ఎండిపోయే దుస్థితికి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఈ సమస్య తీవ్రం అవుతోంది.
పంటలకు సరైన సమయంలో నీరు అందించాల్సి ఉండగా భూగర్భ జలం కూడా ఆదుకోవడం లేదు. తటాకాల్లో నీళ్లు చేరకపోవడంతో భూగర్భ జలం వృద్ధి చెందలేదు. కేసీఆర్ హయాంలో యాసంగి, వానాకాలం సీజన్ అనేది సంబంధం లేకుండా సాగుకు మంచి రోజులు ఉండేవి. ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి సమయానికి రైతులకు సాగు నీటిని అందించి కొరతను నివారించేది. కానిప్పుడు ఆ ఆలోచన లేకుండా పోయింది. ఫలితంగా రైతులకు కన్నీళ్లు తప్పా ఇంకేమీ మిగలడం లేదు.
దారుణమైన పరిస్థితులు..
నిజామాబాద్ జిల్లాలో 33 మండలాలు ఉండగా ఇందులో 19 మండలాల్లో దారుణమైన దుస్థితి వెంటాడుతోంది. కేవలం 14 మండలాల్లోనే సాధారణ వర్షాపాతం ఇప్పటి వరకు కురిసింది. మరో నాలుగు రోజులు వానలు కురియక పోతే ఈ మండలాల్లోనూ లోటు వర్షపాతమే నమోదయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంది. మండలాల వారీగా వాతావరణ లెక్కలు పరిశీలిస్తే ఆర్మూర్, మెండోరా ముప్కాల్, బాల్కొండ, రెంజల్, నవీపేట, వేల్పూర్, చందూర్, ఏర్గట్ల వర్ని, నందిపేట, ఇందల్వాయి, భీంగల్, ధర్పల్లి, సిరికొండ, డిచ్పల్లి మండలాల్లో భారీ సారుప్యత నెలకొంది.
ఈ మండలాల్లో మైనస్ 20శాతం నుంచి మైనస్ 45 శాతం వరకు లోటు వర్షాపాతం నమోదైంది. డొంకేశ్వర్, నిజామాబాద్ రూరల్, బోధన్, మాక్లూర్, ఎడపల్లి, చందూర్, రుద్రూర్ మండలాల్లో కాసింత మెరుగైన స్థితి కనిపిస్తోంది. కామారెడ్డి జిల్లాలోనూ 22 మండలాల్లో 15 మండలాల్లో లోటు వర్షాపాతం నమోదైంది. కేవలం 7 మండలాల్లోనే ఆశాజనకమైన వర్షాపాతం నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
మాచారెడ్డి, కామారెడ్డి, బీబీపేట, దోమకొండ, భిక్కనూర్ మండలాల్లో మినహా మిగిలిన చోట లోటు వర్షాపాతమే ఏర్పడింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వరి నాట్లు పూర్తి మొదటి కలుపు తీసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఈ పరిస్థితిలో సాగుకు నీరు అందకపోవడంతో రైతన్నలంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వానమ్మా ఒక్కసారి వచ్చి పోవమ్మా అంటూ మొగులు మొఖం పెట్టి ఎదురు చూస్తున్నారు.
రైతును దెబ్బతీస్తోన్న వాన..
కేసీఆర్ హయాంలో రైతుకు ఇబ్బందులేవీ దరి చేరలేదు. సాగు నీరు, సకాలంలో ఎరువులు, విత్తనాలు, నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా అందింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువులు, విత్తనాలు సరిగా అందడం లేదు. ఈ వానాకాలం సీజన్లో జీలుగ విత్తనాల కొరత రైతులను తీవ్రంగా వేధించింది. ఆ తర్వాత యూరియా బస్తాల కొరత ఇప్పటికీ రైతులను పట్టి పీడిస్తుంది. సీజన్ ప్రారంభంతోనే నైరుతి రుతుపవనాల రాక మొదలైందన్న ప్రచారం జోరుగు వినిపించింది.
భారీ వానలు కురుస్తాయన్న అంచనాలు సైతం ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి. చిరుజల్లులతో ఆశించినట్లే వానలు పడటంతో రైతన్నలంతా భవిష్యత్తు ఢోకా లేదనుకున్నారు. కానీ పరిస్థితులు రివర్స్ అవుతున్నాయి. రైతులకు అండగా నివాల్సిన అవసరం ఉన్నప్పటికీ సర్కారు పట్టించుకోవడం లేదు. సాగు నీటి కటకట కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ వాన రూపంలో వచ్చే వరదపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టును ఆధారంగా చేసుకుని ఎత్తిపోతల పథకాలను మొదలు పెట్టడం లేదు. ఎస్సారెస్పీ ప్రస్తుతం 40 టీఎంసీలు నీరు వచ్చి చేరింది. వర్షాభావ పరిస్థితి దాపురించినప్పటికీ ఎత్తిపోతల పథకాలను మొదలు పెట్టలేదు. వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అలీసాగర్, గుత్పా ఎత్తిపోతలతో సగానికి ఎక్కువ ఏరియాలో రైతులకు భరోసా కల్పించే వీలున్నప్పటికీ సర్కారు ఆచితూచి వ్యవహరిస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు.
వ్యవసాయాధికారుల సలహాలు పాటించాలి..
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకైతే పంటలకు ఎలాంటి ప్రమాదం లేదు. ఏమైనా ఇక్కట్లు ఉంటే ఏవో, ఏఈవోలతో రైతులు మాట్లాడాలి. వారి సలహా, సూచనలతో సాగు కాలాన్ని వెళ్లదీయాలని కోరుతున్నాను. రైతులు ఎవ్వరూ నిరాశ చెందొద్దు.
– గోవింద్, నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధికారి