కామారెడ్డి, జూన్ 7 : జిల్లాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోజురోజుకూ ప్రైవేట్ పాఠశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తున్నది. ఏడాదికేడాది పదో తరగతి పరీక్షల్లో ఆశించిన మేరకు ఫలితాలూ రావడంలేదు. దీంతో జిల్లాలో విద్యావ్యవస్థ గాడిలో పడేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో హంగులతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. పేద విద్యార్థులుకు కొండంత అండగా నిలిచారు.
ప్రతి జిల్లాలోనూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టారు. ప్రత్యే క కార్యాచరణ రూపొందించి అమల్లోకి తెచ్చారు. కేవలం విద్య నేర్పించడమే కాకుం డా వృత్తి విద్యలోనూ శిక్షణ ఇప్పించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. ఉదయం అల్పాహారం, సన్న బియ్యం తో మధ్యాహ్న భోజనం, రెండు జతల దుస్తులు, పుస్తకాలు ఇలా అన్ని రకాల వసతులను పేద విద్యార్థులకు కల్పించారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్ ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యం చూపుతున్నది. జిల్లాలోని అల్పాహారాలు లేకుండా పాఠశాలలను నడుపుతున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడానికి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పిస్తున్నారు. 2024-25లో 12,022 పిల్లలు, 2025-26 లో 13,621 పిల్లలను బడిలో చేర్పించారు. అయినప్పటికీ రెండేండ్లుగా పదో తరగతిలో మాత్రం ఉత్తీర్ణత శాతం ఆశించిన స్థాయిలో రావడం లేదు. 2024-25 లో 20వ స్థానం, 2025-26 లో 18వ స్థానాన్ని సాధించింది. దీంతో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి సుముఖత చూపడంలేదు.
ఎలాగైనా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ సెన్స్ కార్యక్రమంతో సరిగ్గా నిర్వహించ లేకపోయారు. దీంతో జూన్ 2నుంచి మళ్లీ బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేవలం మొక్కుబడిగా బడి బాట కార్యక్రమాన్ని చేస్తున్నారని, ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి సరైన మార్గాన్ని చూపడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆప్పటి సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థపై నిర్ల క్ష్యం నెలకొన్నది. ఏ కార్యక్రమమైనా తూతూ మంత్రంగానే చేపడుతున్నట్లు సమాచారం. ప్రతి ఏడాది బడిబాట కార్యక్రమం ద్వారా ఎంతో మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఈసారి తూతూ మం త్రంగా నిర్వహిస్తారా.. విద్యార్థులను బడిలో చేర్పిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది నుంచి విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది.