పాలకుడు మంచివాడైతే ప్రకృతి కూడా సహకరిస్తుంది. అందుకే విస్తారంగా వానలు పడుతున్నాయి. అన్నదాతలకు సర్కారు సహకారం లభిస్తుండడంతో దండిగా పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుత వానకాలంలో ఉమ్మడి జిల్లాలో అంచనాలకు మించి పంటలు సాగయ్యాయి. నిరంతర విద్యుత్, పుష్కలంగా సాగునీరు, సకాలంలో పెట్టుబడి సాయం, ఎరువులు, విత్తనాలు అందుతుండడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో పంటలు వేశారు. నిజామాబాద్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5.12 లక్షల ఎకరాలు కాగా, 5.54లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 4.84లక్షల సాధారణ సాగు విస్తీర్ణం కాగా, 5,18,659 ఎకరాల్లో పంటలు వేశారు. వరిపైర్లతో పుడమి తల్లి పచ్చనికోక చుట్టుకున్నట్లు కనుచూపు మేర పచ్చదనం కనిపిస్తున్నది.
నిజామాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయ ప్రాంతాలైన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పంటల సాగు జోరందుకున్నది. 2023-24 వానాకాలంలో అంచనాలకు మించి పంటలు సాగ య్యాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 11లక్షల ఎకరా లకు పంటల సాగు విస్తీర్ణం చేరుకున్నది. ఒకప్పుడు ఉ మ్మడి రాష్ట్రంలో వానాకాలంలోనూ పంటల సాగు అం తగా ఉండేది కాదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో పంట ల సాగుకు రైతులు ముఖం చాటేసేవారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. వానాకాలంలో వర్షాలు దంచి కొట్టడంతో నీటి నిల్వ సమృద్ధిగా అందుబాటులో ఉంది. దీనికి తోడుగా కేసీఆర్ పరిపాలనలో తొమ్మిదేండ్ల కాలంలో వ్యవసాయం పండుగలా సాగుతున్నది. ఏటా రెండు సీజన్లలోనూ కాలంతో పని లేకుండానే రైతులు పంటలను సాగు చేస్తున్నారు. రైతుబంధు సాయంతో పాటు సాగుకు నీళ్లు, సకాలంలో ఎరువులు, విత్తనాలు, నిరంతర విద్యుత్‌తో రైతన్నలకు కష్టమన్నదే లేకుండా పోయింది.
నిజామాబాద్ జిల్లాలో వానాకాలం సాధారణ పంటల విస్తీర్ణం 5లక్షల 12 ఎకరాలు కాగా ప్రస్తుతానికి 5లక్షల 54వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. తాజా లెక్కల మేరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి పంట ఏకంగా 4లక్షల 26వేల 410 ఎకరాల్లో విస్తరించింది. మక్కజొన్న పంట 42,302 ఎకరాల్లో, సోయాబీన్ 51,592 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇక పసుపు పంటకు పెట్టింది పేరుగా నిలిచిన నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి 20,477 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇతరత్రా పంటలను కలుపుకొంటే మొత్తానికి సాధారణ పంటల విసీర్ణంతో పోలిస్తే 40వేల ఎకరాల మేర సాగు విస్తీర్ణం పెరిగింది. కామారెడ్డి జిల్లా లో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 4లక్షల 84వేల 821 ఎకరాలు కాగా 5లక్షల 18వేల 659 ఎకరాల్లో ప్రస్తుతానికి పంటలు సాగయ్యాయి. వ్యవసాయ శాఖ అంచనాలకు మించి 34వేల ఎకరాల్లో అదనంగా పం టలు సాగుకు నోచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకున్న ది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాధారణ విస్తీర్ణం తో పో లిస్తే 70వేల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది.
రైతుబంధు పథకం వచ్చిన తర్వాత కర్షకుల బతుకులు గాడిలో పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పెట్టుబడి సాయం కింద నగదు నేరుగా రైతులకే అందిస్తున్నారు. 2023-24 వానాకాలం సీజన్లో నిజామాబాద్ జిల్లాలో 2లక్షల 71వేల 482 మంది రైతులకు రూ.271.82 కోట్లు అందించారు. కామారెడ్డి జిల్లాలో 3లక్షల 712 మంది రైతులకు రూ.251.54 కోట్లు రైతుబంధు రూపంలో ప్రభుత్వం చెల్లించింది. రైతుబంధు పథకం కూడా సాగు విస్తీర్ణం పెరగడానికి పరోక్షంగా దోహదం చేస్తుండడం విశేషం.
కామారెడ్డి జిల్లాలో ఈ వానాకాలంలో సాధారణ పంట ల విస్తీర్ణం 4లక్షల 84 వేల 821 ఎకరాలు కాగా 5లక్షల 14వేల 659 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 2022లో 5.02లక్షల ఎకరాల్లో పంటలు సాగుకు నో చుకున్నాయి. ఏడాది కాలంలో మరింతగా సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుత వానాకాలం సీజన్లో భిన్న పంటల సమాహారంతో కామారెడ్డి జిల్లాలో పంటలు సాగవుతున్నాయి. ఇందులో ప్రధానంగా వరి పంట 3లక్షల 13వేల ఎకరాల్లో సాగైంది. సోయాబీన్‌ను 91,708 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. మక్కజొన్నను 53వేల ఎకరాల్లో, పత్తి 29,097 ఎకరాల్లో, కందులను 20,918 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది.
పెసర్లు 3,378 ఎకరాల్లో, మినుములు 1,733 ఎకరాల్లో పండిస్తున్నారు. ఇదిలా ఉండగా గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో పలువురు రైతులు ముఖ్యంగా ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో చెరుకు పంటను 822 ఎకరాల్లో పండిస్తున్నారు. అత్యల్పంగా జొన్న ఈసారి కేవలం 91 ఎకరాలకే పరిమితమైంది. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో పంటల భిన్నత్వంలో పసుపు, మక్కజొన్న, కూరగాయల సాగుకు చోటు దక్కుతుండగా కామారెడ్డిలో అపరాల సాగుతో పాటుగా వాణిజ్య పంటలకు ఏటా రైతులంతా పెద్దపీట వేస్తుండడం విశేషం.