బోధన్ రూరల్, మార్చి 5: నిజాంసాగర్ డీ-28కెనాల్ పరిధిలోని 15సబ్ కెనాల్ కింద రైతులు సాగుచేస్తున్న పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతు గురునాథం బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన తోటి రైతులు వెంటనే అతడి చేతిలోని పురుగుల మందు డబ్బాను లాగేసుకున్నారు. బోధన్ మండలంలోని రాంపూర్, సాలూర మండలంలోని జాడిజమాల్పూర్ గ్రామ శివారులో సుమారు 50 ఎకరాల్లో పంటలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు సరఫరా కావడం లేదు.
సాలూర మండలంలోని కొప్పర్తిక్యాంప్ మాజీ సర్పంచ్ గురునాథం జాడిజమాల్పూర్ శివారులో ఆరున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. నిజాంసాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉండడంతో సాగునీటికి ఢోకాలేదని వరి సాగుచేశాడు. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉండగా.. అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరు అందడం లేదు. ఉన్న రెండు బోర్లు కూడా ఎత్తివేశాయి. అప్పు చేసి పంట సాగుచేయగా.. పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేక, పంట ఎండిపోవడంతో తీవ్ర ఆందోళనతో రైతు గురునాథం పురుగుల మందు తాగడానికి బాటిల్ పట్టుకున్నాడు.
గమనించిన చుట్టుపక్కల రైతులు చూసి మందు డబ్బాను లాగేశారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని రైతు వాపోయాడు. కలెక్టర్ ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్షలో కూడా నిజాంసాగర్ చివరి ఆయకట్టుకు నీరు అందిస్తామని చెప్పారని, అయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్ నీటిని విడుదల చేసి ఇప్పటికీ 12రోజులు అవుతున్నా.. చివరి ఆయకట్టుకు నీళ్లు రావడం లేదన్నారు. గత ఏడాది చివరి ఆయకట్టుకు పుష్కలంగా నీరు అందిందని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.
సాలూర మండలం జాడిజమాల్పూర్ గ్రామ శివారులో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఆరున్నర ఎకరాల్లో మా నాన్న గురునాథం వరి సాగు చేశాడు. రెండు బోర్లు ఎత్తిపోయాయి. ఇప్పటి వరకు నిజాంసాగర్ కెనాల్ నీళ్లు రాలేదు. పంటలు ఎండిపోతున్నాయి. రూ.లక్షల్లో అప్పు చేసి పంట పెట్టుబడి పెట్టి చేతికి వచ్చే సమయంలో నీళ్లు లేక ఎండే పరిస్థితి ఏర్పడింది. అధికారులకు చెబితే.. ఎగువ ప్రాంతంలో ఉన్న వారు నీటిని వాడుకుంటున్నారని, చెరువులు నింపుకుంటున్నారని చెబుతున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోమని అంటున్నారు. ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు.
-కృష్ణప్రసాద్, రైతు, కొప్పర్తిక్యాంప్