ఎవుసం ఎండుతున్నది. సాగు సంక్షోభంలోకి జారుకుంటున్నది. పొలం బీడు వారుతుంటే రైతు గుండె తల్లడిల్లుతున్నది. ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. వేసవికి ముందే కరువు ఛాయలు తలెత్తడంతో కర్షకులు కలవరపడుతున్నారు. కండ్ల ముందే పంట ఎండుతుండడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉన్న బోర్లు ఎత్తిపోయాయి. కొత్తవి వేస్తే నీటి చుక్క జాడ లేక అన్నదాతకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట ఎండి పోతుండడం, బోర్లు వేసేందుకు వెచ్చిస్తున్న లక్షల రూపాయలు అప్పుగా మిగులుతుండడంతో రైతు బతుకు దుర్భరమవుతున్నది.
– రామారెడ్డి, మార్చి 8
లక్కాకుల నడిపి రాజయ్య రైతు. ఆయన యాసంగిలో ఒకటిన్నర ఎకరాల్లో రూ.40 వేల పెట్టుబడి పెట్టి వరి వేశాడు. పైరు ప్రస్తుతం పొట్ట దశలో ఉన్నది. అయితే, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బావి అడుగంటింది. బోరు కూడా ఎత్తిపోయింది. కండ్ల ముందే పొలం బీటలు వారగా, పంట ఎండిపోయింది. చేసేది లేక పంటను పశువులకు వదిలేశాడు.
ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిశాయి. చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి. కానీ వేసవి ప్రారంభానికి ముందే నీటి సమస్యలు మొదలు కావడం కలవరపెడుతున్నది. సాగునీటి విషయంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళికా లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏనాడూ నీళ్ల సమస్య రాలేదు. పంటలు ఎండిపోలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు, వ్యవసాయం, సాగునీరు, కరెంట్పైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూశారు.
ఫలితంగా రైతులు పదేండ్లు సంతోషంగా పంటలు సాగు చేశారు. కానీ, కాంగ్రెస్ వచ్చాక సాగు సంక్షోభంలో చిక్కుకున్నది. పదేండ్ల కిందటి దుర్భర పరిస్థితులు పునరావృతమయ్యాయి. బీఆర్ఎస్ హయాంలో పంటలు వేయడానికి ముందే రైతుబంధు డబ్బులు ఖాతాల్లో పడేవి. సమృద్ధిగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేవి. దండిగా నీళ్లు, నిరంతర కరెంట్ సరఫరా అయ్యేది. కాంగ్రెస్ గద్దెనెక్కాక రైతుబంధు పథకానికి గ్రహణం పట్టింది. ఎరువులు, విత్తనాలకు కటకట ఏర్పడింది. సాగునీటి సమస్య తలెత్తింది. ఫలితంగా రైతులు కుదేలవుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో భారీగా పంటలు సాగు చేశారు. రెండు జిల్లాల్లో కలిపి సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు వేయగా, ప్రధానంగా వరి ఎక్కువగా సాగు చేశారు. రైతులు ఆశించినట్లుగానే పొలాలు ఏపుగా పెరిగాయి. కొన్నిచోట్ల వరి పొట్ట దశలో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పొట్ట దశకు వస్తున్నాయి. నీరు అత్యధికంగా అవసరమైన ఈ సమయంలోనే నీటి సమస్య మొదలైంది. బావులు ఎండిపోగా, భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తిపోతున్నాయి. నీళ్లు లేక పొలాలు బీళ్లు వారుతున్నాయి. కండ్ల ముందే వరి పైర్లు వాడిపోతుండడం చూసి రైతు గుండె తరుక్కుపోతున్నది. బోర్లు వేస్తున్నా చుక్కనీరు రాకపోవడం, ట్యాంకర్లతో నీళ్లందిస్తున్నా లాభం లేకపోవడంతో చివరకు పంటలను పశువులకు వదిలేస్తున్నారు.
ఒకటిన్నర ఎకరంల వరి ఏసిన. దున్ను డు, నాట్లు ఏసుడు, మందులకు ఇప్పటిదాకా నలభై వేలు ఖర్సు వెట్టిన. పొలం మంచిగున్నది. ఇక ఢోకా లేదనుకున్న. అంతట్లనే బాయి ఎండిపాయే. బోరు సుత ఎత్తిపాయే. ఏం చేయాల్నో అర్థమైతలేదు. పొలం పర్రెలు వాసింది. బర్రెలకు, మేకలకు వదిలేసిన. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాల.
– లక్కాకుల నడిపి రాజయ్య, రైతు