నిజామాబాద్, ఆగస్టు 29, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసిన అత్యంత భారీ వానలు ఎనలేని నష్టాన్ని మిగిల్చింది. వరద సృష్టించిన విధ్వంసానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు అనేకం నేలమట్టం అయ్యాయి. పంట పొలాలు నీట మునిగిపోగా వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు పేరుకు పోయి రైతులను కోలుకోకుండా చేశాయి. బుధ, గురువారాల్లో కురిసిన భయానక వానకు కామారెడ్డి జిల్లాలో 32వేల 907 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లుగా వ్యవసాయ శాఖ పేర్కొంది. ఇంకా నష్ట అంచనాల సేకరణ ప్రక్రియ జరుగుతోంది.
ఇప్పటికీ 15 మండలాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టలేదు. పూర్తి స్థాయిలో వరద ప్రవాహం తగ్గిన తర్వాత వ్యవసాయ శాఖ అంచనాల్లో స్పష్టత రానుంది. రెండు రోజులుగా వివిధ శాఖల ఆధ్వర్యంలో సంభవించిన నష్టంపై అధికారుల బృందాలు క్షేత్ర స్థాయిలో తిరిగి సంబంధిత ఇంజనీర్లతో నష్ట అంచనాలు సిద్ధం చేశారు. ఈ మేరకు కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిపై పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 12 శాఖల్లో(వ్యవసాయ శాఖ కాకుండా) 633 పనులు విధ్వంసానికి గురయ్యాయి.
వీటిని తక్షణం మరమత్తులు చేపట్టి ప్రజా ఉపయోగానికి తీసుకు వచ్చేందుకు రూ.22.47కోట్లు నిధులు అవసరం అవుతాయని ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది. అతి భారీ వానల మూలంగా గ్రామ పంచాయతీ భవనాలు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, రోడ్డు భవనాల శాఖ రహదారుల, పంచాయతీ రాజ్ రోడ్లు, మిషన్ భగీరథ పైప్లైన్ వ్యవస్థ, నీటి ట్యాంకులు, విద్యుత్ స్తంభాలు, కరెంట్ తీగలు, మున్సిపాలిటీల్లో సంభవించిన నష్టం, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం రూ.130.03కోట్లు నష్టం సంభవించినట్లుగా లెక్కలు సిద్ధం చేశారు. ఈ నివేదికను ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సమర్పించనున్నారు. పూర్తి స్థాయి నివేదికకు మరో వారం రోజులు పట్టే ఆస్కారం ఉంది.
నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 41వేల 98 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లుగా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసింది. మంజీరా, గోదావరిలో ఉధృతంగా ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో వరద తగ్గితే మరింత నష్ట వివరాలు వెలుగు చూసే ఆస్కారం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. శుక్రవారం నాటికి సేకరించిన వివరాల మేరకు 20వేల 660 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ పొలాలు తీవ్ర స్థాయిలో నష్టాన్ని చవి చూశాయి.
అతి భారీ వర్షాలు నిజామాబాద్ జిల్లాలో 21 మండలాల్లో 145 గ్రామాల్లో నష్ట పర్చింది. 14,663 మంది రైతులకు సంబంధించిన 28,131 ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది. 47 మంది రైతులకు చెందిన 81 ఎకరాల్లో పత్తి, 382 మంది రైతుల 565 ఎకరాల్లో మొక్కజొన్న, సోయాబీన్ పంట 12,054 ఎకరాల్లో 5418 మంది రైతులకు నష్టాన్ని చేకూర్చింది. 139 రైతులకు చెందిన ఉద్యాన పంటలు 252 ఎకరాల్లో, ఐదు ఎకరాల్లో పెసర్లు సైతం వరద వల్ల నష్టం సంభవించింది. 11 మండలాల్లో 1021 ఎకరాల్లో ఇసుక మేటలు కూరుకుపోయినట్లుగా వ్యవసాయ శాఖ వెల్లడించింది. నష్ట తీవ్రత మరింత పెరిగే ఆస్కారం ఉంది.